యాప్నగరం

సివిల్స్‌‌కు ప్రిపేరవుతూ.. డబ్బుల కోసం అడ్డదారి!

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 27 ఏళ్ల ఓ యువకుడు కిడ్నాప్ కేసులో అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 15 Mar 2018, 5:57 pm
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 27 ఏళ్ల ఓ యువకుడు కిడ్నాప్ కేసులో అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువకుడు దేశ అత్యున్నత సర్వీసుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఎంటెక్ పూర్తి చేసిన సదరు వ్యక్తి గత కొన్నేళ్లుగా యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్నాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తూ చేతి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంటున్నాడు. అయితే.. ప్రిపరేషన్ కోసం కోచింగ్, స్టడీ మెటీరియల్, వ్యక్తిగత ఖర్చులు అన్నీ కలిపి భారీ మొత్తం అవుతుండటంతో సన్నిహితుల వద్ద లెక్కకు మిక్కిలి అప్పులు చేశాడు.
Samayam Telugu upsc aspirant turns kidnapper arrested in delhi
సివిల్స్‌‌కు ప్రిపేరవుతూ.. డబ్బుల కోసం అడ్డదారి!


పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో సదరు యువకుడు ఓ కుతంత్రానికి పథకం వేశాడు. భజన్‌పురా ప్రాంతానికి చెందిన అయిదేళ్ల ఓ బాలుణ్ని కిడ్నాప్ చేశాడు. అనంతరం నంబర్లను మార్చి మార్చి బాలుడి తండ్రికి ఫోన్ చేశాడు. తాను చెప్పిన చోటుకి రూ. 20 లక్షలు తెచ్చిస్తే గానీ.. చిన్నారిని వదిలిపెట్టనని, ఆలస్యం చేస్తే బాలుడి ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించాడు.

బాలుడి తండ్రి ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక సాయంతో పోలీసులు నిందితుడు ఉన్న లొకేషన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. బాలుణ్ని సురక్షితంగా అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. విచారణలో కిడ్నాపర్ చెప్పిన కారణాలు విని విస్తూపోయారు.

సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్న యువకుడు ఇలా అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్కవడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా.. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో సివిల్స్ స్థాయి పరీక్షలకు సన్నద్ధమవడం నేటికీ ఖరీదైన అంశంగానే మిగిలిపోయిన విషయాన్ని ఈ ఉదంతం మరోసారి వెలుగులోకి తెచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.