యాప్నగరం

యురీపై మరో ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన ఆర్మీ

యురీ సైనిక స్థావరంపై గతేడాది తరహాలోనే దాడి చేయడానికి ప్రయత్నించిన ముష్కరమూకల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల కదలికలను ముందుగానే గమనించి అప్రమత్తమైన ఆర్మీ చాకచక్యంగా నలుగురు ముష్కరులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని కల్గాం సెక్టార్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన..

TNN 25 Sep 2017, 4:13 pm
యురీ సైనిక స్థావరంపై గతేడాది తరహాలోనే దాడి చేయడానికి ప్రయత్నించిన ముష్కరమూకల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల కదలికలను ముందుగానే గమనించి అప్రమత్తమైన ఆర్మీ చాకచక్యంగా నలుగురు ముష్కరులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని కల్గాం సెక్టార్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను యురీ బ్రిగేడ్ డిప్యూటీ కమాండర్ హర్‌ప్రీత్ సింగ్ సోమవారం (సెప్టెంబర్ 25) మీడియాకు వెల్లడించారు. శనివారం రాత్రి సాయుధులైన కొంత మంది ఉగ్రవాదులు బారాముల్లా జిల్లా యురీ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి ప్రవేశించారు. కల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్న సైన్యంపైకి ఆదివారం వేకువజామున స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
Samayam Telugu uri like attack plan 4 terrorists killed in kashmir
యురీపై మరో ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన ఆర్మీ


వెంటనే అప్రమత్తమైన ఆర్మీ ఎన్‌కౌంటర్ ప్రారంభించింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పౌరులను సురక్షితంగా తప్పించి, వెంటనే ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లో దూరుతూ.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం వరకూ కొనసాగిన భీకర పోరులో మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అంతమొందించినట్లు హర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో స్థానికులెవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన తెలిపారు.

ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను తరలిస్తున్నామని సింగ్ వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదుల దగ్గర నుంచి విధ్వంసక సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ముష్కరులందరూ విదేశీయులేనని, వారి వద్ద కొన్ని ఐడెంటిటీ కార్డులు కూడా లభించాయని హర్‌ప్రీత్ సింగ్ వివరించారు.
#WATCH Press Conference of Deputy Commander, Uri Brigade Harpreet Singh on Uri Encounter (J&K) https://t.co/AteeB79CkM — ANI (@ANI) September 25, 2017 2016 సెప్టెంబర్‌లో యురీలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మెరుపుదాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.