యాప్నగరం

శభాష్.. కూతురు మరణ వార్త తెలిసినా వృత్తికే ప్రాధాన్యతనిచ్చాడు!

విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ తన కుమార్తెను మరణవార్తను కూడా లెక్కచేయక చావుబతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడి శభాష్ అనిపించుకున్నారు.

TNN 2 Mar 2018, 8:46 am
విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ తన కుమార్తెను మరణవార్తను కూడా లెక్కచేయక చావుబతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ కానిస్టేబుల్‌పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కూతురు ప్రాణాలు పోయినా విధులకే ప్రాధాన్యత ఇచ్చిన అతడి అంకితభావం పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠకే గర్వకారణం. ఫిబ్రవరి 23 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫిబ్రవరి 23 ఉదయం 9 గంటల సమయంలో షహరాన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 వాహనంపై హెడ్ కానిస్టేబుల్ భూపేంద్ర తోమర్, అతడి బృందం విధులకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో రామ్‌పూర్ మనిహారన్-బడగావ్ రోడ్డులోని సిర్సా గ్రామంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడిచేసి గాయపరిచారని, అతడు రోడుపై కత్తిపోట్లతో పడి ఉన్నాడని సమాచారం అందింది.
Samayam Telugu uttar pradesh cop puts duty over daughters death
శభాష్.. కూతురు మరణ వార్త తెలిసినా వృత్తికే ప్రాధాన్యతనిచ్చాడు!


తక్షణమే స్పందించిన భూపేంద్ర తన బృందంతో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగానే భూపేంద్రకు తన కుమార్తె జ్యోతి (27) అకస్మాత్తుగా మృతి చెందినట్లు ఫోన్ వచ్చింది. నర్స్‌గా పనిచేస్తున్న జ్యోతికి గతేడాదే వివాహం అయింది. ఆ వార్త విన్న వెంటనే భూపేంద్ర షాక్‌కు గురయ్యారు. అయితే విధుల్లో ఉన్నాననే విషయం గుర్తుకు వచ్చి వెంటనే తేరుకున్నారు. అంతటి దుఃఖంలోనూ విధులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు. వాస్తవానికి మిగతా వారిని సమాచారం వచ్చిన ప్రదేశానికి పంపించి ఆయన ఇంటికి వెళ్లవచ్చు. కానీ అలాచేయకుండా... కన్నీటిని దిగమింగి ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

రోడ్డుపై కత్తిపోట్లతో పడి ఉన్న వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలను కాపాడారు. అంతటి కష్టంలోనూ తన వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టలేదు సరికదా నేనేదో ఘనకార్యం సాధించలేదని పేర్కోవడం గమనార్హం. ‘చావుబతుకుల్లో ఉన్న ఓ వ్యక్తిని కాపాడడమే తన కర్తవ్యమని భావించా. అది నా విధి మాత్రమే. అంతేగానీ నేనేదో గొప్ప పనిచేశానని అనుకోవడం లేదు’ అంటూ భూపేంద్రకు తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ విషయం గురించి తెలిసిన షహరాన్‌పూర్ డీఐజీ శరద్ సచిన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) బబ్లూ కుమార్‌లు భూపేంద్రను లక్నోలో శుక్రవారం సత్కరించనున్నారు.

భూపేంద్ర కుమార్తె మీరట్‌లోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. హఠాత్తుగా వాష్‌రూప్‌లో పడిపోయిన జ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించి భూపేంద్ర మాట్లాడుతూ జ్యోతి చనిపోయినట్లు కాల్ వచ్చింది.. కానీ అప్పటికే వ్యక్తిపై దాడిచేసి ప్రాంతానికి బయలుదేరామని, చావుబతుకుల్లో ఉన్న అతడిని కాపాడటమే ముఖ్యమని భావించానని తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.