యాప్నగరం

కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. ఇటీవలే కోవిడ్-19తో కన్నుమూసిన ఆయన భార్య

కరోనా వైరస్ మహమ్మారికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ యువ ఎమ్మెల్యే బలయ్యారు. ఆయన భార్య కూడా కొద్ది రోజుల కిందట మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 12 Nov 2020, 9:06 am
కరోనా వైరస్ బారినపడి ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజాప్రతినిధులను మహమ్మారి పొట్టనబెట్టుకుంది. తాజాగా, ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా (50) కరోనా వైరస్‌తో మృతిచెందారు. కరోనా వైరస్‌ బారినపడ్డ ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. రెండు వారాల కిందట కరోనా వైరస్ నిర్దారణ కావడంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. సర్ గంగారాం ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న జీనా ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Samayam Telugu బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్


ఇక, ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ భార్య ధర్మాదేవి సైతం ఇటీవలే కరోనా వైరస్‌తోనే చనిపోయారు. కరోనా వైరస్ సోకిన ఆమె గుండెపోటుతో చనిపోవడం బాధాకరం. ప్రస్తుతం అల్మోరా జిల్లా సాల్ట్ నియోజకవర్గానికి సురేంద్ర సింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే స్థానం నుంచి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సురేంద్ర సింగ్ జీనా 2006లో మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత 2007 ఎన్నికల్లో తొలిసారి సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. వరుసగా 2012, 2017 ఎన్నికల్లోనూ అక్కడ నుంచే గెలుపొందారు. ఆయన మరణంపై బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.