యాప్నగరం

ఈ దారుణ సన్నివేశాలు ప్రజలు చూడొద్దు: వెంకయ్య

కేంద్రంపై టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. సభలో విపక్షాల ఆందోళనపై వెంకయ్య నాయుడు స్పందించారు. చట్ట సభలో జరుగుతున్న దారుణమైన సన్నివేశాలు ప్రజలకు కనిపించొద్దనే సభను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

Samayam Telugu 22 Mar 2018, 3:35 pm
లోక్‌సభ, రాజ్యసభలో వరసగా ఐదో రోజు కూడా అదే సీన్ రిపీట్ అయింది. కేంద్రంపై టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులపై చర్చ జరగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం (మార్చి 22) ఉదయం రాజ్య సభ ప్రారంభం కాగానే ఇరాక్‌లో భారతీయుల మృతి అంశంపై కాంగ్రెస్, కావేరీ జలాల అంశంపై అన్నాడీఎంకే, అవిశ్వాస తీర్మానంపై టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. కొంత మంది సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.
Samayam Telugu Venkaiah
వెంకయ్య నాయుడు..


సభ్యులందరినీ వారి సీట్లలో కూర్చోమంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో మొదట ఆయన సభను 5 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా సభ జరుగుతున్న తీరుపై వెంకయ్య ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

సభలో విపక్షాల ఆందోళనపై వెంకయ్య నాయుడు స్పందించారు. చట్ట సభలో జరుగుతున్న దారుణమైన సన్నివేశాలు ప్రజలకు కనిపించొద్దనే సభను రోజంతా వాయిదా వేస్తున్నానని చెప్పారు. టీడీపీ సభ్యుల ఆందోళనను ఉద్దేశించి మాట్లాడుతూ.. విభజన బిల్లులోని హామీలపై గతంలో సుదీర్ఘంగా చర్చించామని, దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సమాధానం చెప్పారని వెంకయ్య అన్నారు.

అంతకుమందు ‘గ్రాట్యుటీ బిల్లు’కు రాజ్యసభలో ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లును గత గురువారమే లోకసభ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదం త్వరాత బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ఈ బిల్లు ద్వారా ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీ ప్రస్తుతమున్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెరుగుతుంది. దీంతోపాటు భవిష్యత్‌లో గ్రాట్యుటీని పెంచడానికి, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు కాలాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు జీవో జారీ చేయడం ద్వారా వీటిని పెంచుకునే హక్కు ప్రభుత్వానికి లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.