యాప్నగరం

సభలో సభ్యుల తీరుపై వెంకయ్య ఆగ్రహం!

పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదాపై ఉభయసభల్లోనూ ఏపీ ఎంపీలు నిరసన తెలియజేశారు.

TNN 5 Mar 2018, 12:57 pm
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదాపై ఉభయసభల్లోనూ ఏపీ ఎంపీలు నిరసన తెలియజేశారు. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఫ్లకార్డులను ప్రదర్శించారు. అటు రాజ్యసభలోనూ విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ సభ్యులు నినాదాలు చేశారు. సభ ప్రారంభమైన వెంటనే ఎంపీలు అడ్డుకోవడంతో సభ్యుల తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను సభ్యులు అడ్డుకోవడం మంచిది కాదని ఆయన సూచించారు. వెంకయ్యనాయడు వారించినా ఎంపీలు వినిపించుకోవడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి 11.20 నిమిషాలకు సభ ప్రారంభమైనా సభ్యులు ఆందోళన మాత్రం ఆగలేదు. దీంతో వెంకయ్యనాయుడు సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu vice president venkaiah naidu fires on rajya sabha members
సభలో సభ్యుల తీరుపై వెంకయ్య ఆగ్రహం!


మనం పార్లమెంటులోనే ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా? అని మండిపడ్డారు. సభలో మన వ్యవహార శైలిని దేశమంతా చూస్తూ ఉంటుందని.. సభ్యులు సంయమనం పాటించాలని సూచించారు. కానీ వెంకయ్య సూచనలు సభ్యులు పట్టించుకోలేదు సరికదా, ఏపీ ఎంపీలు వెల్‌‌లోకి వచ్చి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంపై ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ చర్యలు సభా సంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.