యాప్నగరం

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన తొలి దశ ఎన్నికల పోలింగ్

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ మొదలైన తర్వాత బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు నిబంధనలు పాటించాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది.

Samayam Telugu 28 Oct 2020, 7:52 am
Samayam Telugu బిహార్ ఎన్నికలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ బుధవారం ఉదయం 7.00 గంటలకు మొదలయ్యింది. మొత్తం 71 నియోజవర్గాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కోవిడ్-19 కారణంగా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద గరిష్ఠంగా 1,000 మంది ఓటర్లకు మాత్రమే అనుమతించనున్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు పోలింగ్ కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు సౌకర్యం కల్పించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

తొలి దశలో 71 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 1,066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం రెండు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 1.12 కోట్లు, మహిళలు 1.01 కోట్లు కాగా, ఇతరులు 599 మంది. మొత్తం 31,371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అత్యధికంగా గయ టౌన్‌లో 27 మంది పోటీ చేస్తుండగా.. కటోరియాలో ఐదుగురు పోటీచేస్తున్నారు.

భారీ భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. ఔరంగాబాద్ ధిబ్రా వద్ద రెండు మందుపాతరలను సీఆర్పీఎఫ్ సకాలంలో గుర్తించి నిర్వీర్యం చేయడంతో ముప్పు తప్పింది. మొత్తం 243 స్థానాలకు గానూ మొదటి విడతలో 71 నియోజకవర్గాలు, రెండో దశలో 94, మూడో దశలో 78 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయాన్ని అదనంగా ఓ గంటపాటు పెంచారు. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయి ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు చివరి గంటలో ఓటింగ్‌కు అవకాశం కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.