యాప్నగరం

వీడియో: ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న వానలు.. గంగా నది ఉగ్రరూపం

దక్షిణాది రాష్ట్రం కేరళకు కాస్త తెరపి ఇచ్చిన వరుణదేవుడు ఇప్పుడు హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ వైపు మరలాడు. భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.

TNN 25 Aug 2018, 10:57 pm
దక్షిణాది రాష్ట్రం కేరళకు కాస్త తెరపి ఇచ్చిన వరుణదేవుడు ఇప్పుడు హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ వైపు మరలాడు. భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. 24 గంటలుగా కురుస్తున్న వానలతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. వరదల బారిన పడ్డ ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Samayam Telugu rain


భారీ వర్షాలకు గంగానది, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరకాశీ, ఉదమ్ సింగ్ నగర్, బజ్‌పూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది.

హరిద్వార్‌లో వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయింది. అధికారులు, స్థానికులు డ్రైవర్‌ను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. చాలా చోట్ల నదులు రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత ఆందోళన
మరోవైపు.. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా.. కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.


భయపెడుతున్న గంగా నది..
భారీ వర్షాలతో గంగా నదిలో వరద ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. చాలా చోట్ల నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ పుణ్యక్షేత్రంలో ఆలయ పరిసరాల్లోకి నీరు చేరుకుంది. ఎడతెరపి లేని వర్షాలతో గంట గంటకూ ఉగ్రరూపం దాలుస్తోంది. గంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.