యాప్నగరం

వీడియో: వరదల్లో యువకుడు.. ఎలా పైకి లాగారంటే

కేరళ వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వరదలో చిక్కుకున్న ఓ యువకుణ్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఒకరు హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో రక్షిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది.

Samayam Telugu 16 Aug 2018, 4:00 pm
ఎడతెరిపిలేని వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో 80 శాతం భూభాగం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరద నీరే. ప్రధాన డ్యామ్‌ల గేట్లు ఎత్తేసి నీటిని కిందకి విడుదల చేస్తుండటంతో పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఇళ్లల్లోకి వరద నీరు ముంచెత్తుండటంతో ప్రజలు ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది వరదల్లో చిక్కుకుపోతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు.
Samayam Telugu kerala


తాజాగా వరదలో చిక్కుకున్న ఓ యువకుణ్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఒకరు హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో రక్షిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. రాష్ట్రంలోని పనమ్‌తిట్ట, చలక్కుడి ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లు నీట మునుగుతున్నాయి. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్లపైకి, ఎత్తైన ప్రాంతాలకు చేరుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. ఇలాగే ఓ ప్రాంతంలో చిక్కుకుపోయిన యువకుణ్ని ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో రక్షించారు.
వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు రోజుల కిందట కన్నయ్య కుమార్‌ అనే ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

కొనసాగుతున్న వరద ఉద్ధృతి.. భయాందోళనల్లో జనం
కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. కుండపోత వర్షాలక కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 87 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కాసర్‌గఢ్ మినహా మిగిలిన 13 జిల్లాల్లో పాఠశాలకు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

ఇడుక్కి, చెరతోని తదితర ప్రధాన రిజర్వాయర్ల గేట్లను ఎత్తివేయడంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు విస్తృతంగా చేపడుతున్నారు. కేంద్రం నుంచి మరిన్ని బలగాలను పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.