యాప్నగరం

క్లాస్ రూం ఫ్లోర్‌‌కు పగుళ్లు.. పాము కరిచి విద్యార్థిని మృతి, రాహుల్ నియోజకవర్గంలో..

Keralaలోని వయనాడ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్లాస్ రూంలో పాము కరవడంతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఫ్లోర్ మీద ఉన్న పగుళ్లలో బాలిక కాలు పెట్టడంతో.. అందులోని పాము ఆ పాపను కరిచింది.

Samayam Telugu 21 Nov 2019, 2:28 pm
తరగతి గదిలో పాము కాటుకు గురై ఓ విద్యార్థిని ప్రాణాలు వదిలిన ఘటన కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షెహ్లా షెరిన్ (9) వయనాడ్‌లోని సుల్తాన్ బథేరీ ఏరియాలో.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సర్వజన హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. షెరిన్ తరగతి గదిలో గోడకు సమీపంలో కూర్చుందని.. గోడకు ఉన్న రంధ్రంలో ఆమె కాలు పెట్టగా.. పాము కాటేసిందని స్కూల్ యాజమాన్యం చెబుతోంది.
Samayam Telugu క్లాస్ రూంలో పాము కాటు.. బాలిక దుర్మరణం


షెరిన్ కాలిపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించిన టీచర్.. వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలికను హుటాహుటిన సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గవర్నమెంట్ తాలుకా హాస్పిటల్‌కు తరలించారు.

బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో.. కోజికోడ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్చుకోలేదు. చివరకు ఆ బాలిక వయనాడ్ జిల్లాలోని వైథిరిలో ఉన్న ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

కాగా బయటకు వచ్చిన ఫొటోలను బట్టి.. తరగతి గది ఫ్లోర్ మీద పగులు ఏర్పడిందని.. అందులో బాలిక కాలు పెట్టగా.. అప్పటికే ఆ రంధ్రంలో ఉన్న పాము కాటేసిందని అర్థం అవుతోంది. క్లాస్ రూం ఫ్లోర్ మీద ఇలాంటి గుంతలు చాలా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పాము కాటుకు గురైన షెహ్లా షెరిన్‌కు చికిత్స అందించడానికి స్కూల్ యాజమాన్యం తటపటాయించిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వయనాడ్ రాహుల్ గాంధీ నియోజకవర్గం కావడంతో.. పాము కాటుకు గురై బాలిక మరణించిన వార్త దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.