యాప్నగరం

పౌరసత్వ సవరణ చట్టంపై విచారణ చేపడతాం.. ముందు హింసను ఆపండి: సుప్రీం

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై తక్షణ విచారణకు నిరాకరించింది.

Samayam Telugu 16 Dec 2019, 11:45 am
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. అటు ఈశాన్య నుంచి ఇటు దక్షిణాది వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం నాడు ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు రణరంగాన్ని తలపించాయి. వారిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీఛార్జ్ చేసి, కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఢిల్లీ మైనార్టీ కమిషన్ తీవ్రంగా స్పందించడంతో వారిలో 50మందిని పోలీసులు సోమవారం వేకువజామున విడుదల చేశారు. ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అసోంలో బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ సైతం యూటర్న్ తీసుకుని, సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైంది.
Samayam Telugu caa1


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రిజిస్ట్రీ ద్వారా కోర్టును సంప్రదించాలని దీనిపై మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అంతేకాదు, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారిన అంశంపై విచారణకు అంగీకరించింది. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఢిల్లీ, అలీగఢ్ వర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

అంతకు ముందు జామియా మిల్లియా ఇస్లామియా, అలీగఢ్ ఘటనలపై సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వివరించారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించిన ఇందిరా జైసింగ్.. ఈ అంశాన్ని సుమోటాగా తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

పౌరసత్వ చట్టంపై జరుగుతున్న హింస గురించి తెలుసుకోవాని న్యాయవాదులు కోరగా, ఇలాంటి బెదిరింపులు పనికిరావని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, తాము హక్కులను నిర్ణయిస్తాము కానీ, హింసాత్మక వాతావరణంలో కాదు.. వీటిని ఆపిన తర్వాత సుమోటాగా స్వీకరిస్తాం.. హక్కులు, శాంతియుత ప్రదర్శనలకు సుప్రీం వ్యతిరేకం కాదని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు.

మరోవైపు, జామియా మిల్లియా వర్సిటీ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న 52 మంది విద్యార్థులు, లాఠీఛార్జ్‌లో గాయపడినవారికి సరైన వైద్యసాయం అందించాలని, పరిహారం అందజేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.