యాప్నగరం

రాందేవ్ బాబాకు మహారాష్ట్ర, రాజస్థాన్ షాక్.. కరోనా డ్రగ్‌కు అనుమతి నిరాకరణ

ప్రాణాంతక కరోనా వైరస్‌కు తాము ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసినట్టు ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా రెండు రోజుల కిందట ప్రకటించి.. దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

Samayam Telugu 25 Jun 2020, 3:14 pm
యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ జూన్ 23న విడుదల చేసిన‘కరోనిల్’ఆయుర్వేద మాత్రలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. పతంజలి సంస్థ కరోనాకు మందును తీసుకొస్తే సంతోషకరమైన విషయమేనని.. అయితే, ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ బుధవారం వ్యాఖ్యానించారు. అయితే, పతంజలి సంస్థ కరోనిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అసలు కరోనా వైరస్‌ పేరునే ప్రస్తావించలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వ విచారణలో తేలింది.
Samayam Telugu పతంజలి కరోనా ఔషధం
Patanjali Coronaviurs Drug


రోగ నిరోధకశక్తి పెంపొందించడానికి, దగ్గు, జ్వరం నియంత్రణకు ఆయుర్వేద మందు తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ తన దరఖాస్తులో పేర్కొందని వెల్లడించింది. దీంతో ఈ మందుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా, పతంజలి విడుదల చేసిన కరోనిల్ మాత్రలకు తమ రాష్ట్రంలో అనుమతిలేదని రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు గురువారం ప్రకటించాయి. భారత వైద్య పరిశోధన మండలి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ స్పష్టం చేశారు.

‘జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పతంజలి ఆయుర్వేద్ 'కరోనిల్' క్లినికల్ ట్రయల్స్ అసలు జరిగిందా అని కనుగొంటామని’ మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. అప్పటి వరకూ తమ రాష్ట్రంలో దీనిని అమ్మడానికి వీల్లేదని పేర్కొన్నారు.

నకిలీ ఔషధాల అమ్మకాన్ని మహారాష్ట్ర అనుమతించదని రాందేవ్ బాబాకు విస్తృతమైన హెచ్చరిక చేసిన దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఉదాసీనత ప్రదర్శించదని, ప్రాణాలతో చెలగాటం ఆడదని అన్నారు.

అశ్వగంధ, గిలోయ్, తులసితో కలిపి కరోనిల్‌ను కరోనా బాధితులకు చికిత్సలో వినియోగించినప్పుడు 100 శాతం మంది కోలుకున్నారని ఈ మందు విడుదల సందర్భంగా బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా రూపొందించినట్టు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును తీసుకొచ్చామని ఆయన వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు. ఈ మందును తీసుకురావడంతో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.