యాప్నగరం

రాజ్యసభలో సచిన్‌ను మాట్లాడనివ్వని కాంగ్రెస్ ఎంపీలు

రాజ్యసభలో తొలిసారి తన గొంతును వినిపించడానికి వచ్చిన క్రికెట్ దిగ్గజం, నామినేటెడ్ ఎంపీ సచిన్ టెండూల్కర్‌కు అవమానం ఎదురైంది.

TNN 21 Dec 2017, 3:55 pm
రాజ్యసభలో తొలిసారి తన గొంతును వినిపించడానికి వచ్చిన క్రికెట్ దిగ్గజం, నామినేటెడ్ ఎంపీ సచిన్ టెండూల్కర్‌కు కాంగ్రెస్ అడ్డుతగిలింది. కాంగ్రెస్ ఎంపీలు అనవసరపు రగడ చేసి సచిన్‌ను మాట్లాడనివ్వకుండా చేశారు. చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంత సర్ది చెప్పినా వినలేదు. సుమారు 10 నిమిషాల పాటు మౌనంగా నిలుచున్న సచిన్ ఆఖరికి కూర్చుండిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు ఆపకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటల వరకు చైర్మన్ వాయిదా వేశారు.
Samayam Telugu when bharat ratna sachin tendulkar was not allowed to speak in rajya sabha
రాజ్యసభలో సచిన్‌ను మాట్లాడనివ్వని కాంగ్రెస్ ఎంపీలు


కాంగ్రెస్ రగడ సచిన్ కోసం కాదు..
‘భారత్‌లో క్రీడల భవితవ్యం, పిల్లలకు ఆడుకునే హక్కు’ అంశంపై రాజ్యసభలో ఓ చిన్న చర్చకు సచిన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనే స్వయంగా నోటీసులు ఇవ్వడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు సచిన్ తొలిసారి రాజ్యసభలో మాట్లాడుతుండటంతో దృష్టంతా ఆయనపైనే పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తరవాత చర్చను లేవనెత్తేందుకు సచిన్ తన సీటులో నుంచి లేచారు. వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ఒంటికాలిపై లేచి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలంటూ గొడవ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్‌తో కుమ్మక్కయ్యారని చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.

మీకు క్రీడా స్ఫూర్తి లేదు: వెంకయ్య
కాంగ్రెస్ నినాదాలు చేసేటప్పుడు సచిన్ మౌనంగా నిలుచొని ఉండిపోయారు. చైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత చెబుతున్నా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ‘ప్రజలు చూస్తున్నారు, టెండూల్కర్‌ను మాట్లాడనివ్వండి. మనం క్రీడల గురించి చర్చించుకుంటున్నాం, కానీ మీకు క్రీడా స్ఫూర్తి అస్సలు లేదు’ అని వెంకయ్య కాంగ్రెస్ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. ఎంతకీ వారు నినాదాలు ఆపకపోవడంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేసేశారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీలు బుధవారం కూడా ఇదే పనిమీద ఉన్నారు. సభ ప్రారంభం కాగానే మోదీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు అందుకున్నారు. అయితే గురువారం సచిన్ మాట్లాడటానికి నిలబడినప్పుడే కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.