యాప్నగరం

అప్పుడు తప్పు చేశా.. ఇప్పుడు బాధపడుతున్నా: యడ్యూరప్ప

కుమారస్వామిపై నిప్పులు చెరిగారు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అధికారం కోసం జేడీఎస్ ఎంతకైనా దిగజారుతుందంటూ మండిపడ్డారు.

Samayam Telugu 25 May 2018, 4:15 pm
కుమారస్వామిపై నిప్పులు చెరిగారు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అధికారం కోసం జేడీఎస్ ఎంతకైనా దిగజారుతుందంటూ మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించినా.. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిశాయని.. వారిది అపవిత్ర కలయికని విమర్శించారు. 'ఎన్నికల్లో సిద్ధరామయ్య ఓ నియోజకవర్గంలో ఓడారు.. మంత్రులు కొంతమందికి ఓటమి తప్పలేదు. జేడీఎస్‌కు చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు' యడ్డీ.
Samayam Telugu Yeddi


'కాంగ్రెస్ అధిష్టానం కుమారస్వామిని చర్చలకు పిలిచి సిద్ధరామయ్యను అవమానపరిచింది. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులే లేరా. డీకే శివకుమార్ కూడా జీవితంలో ఒక్కసారైనా తాను చేసిన పనికి బాధపడతారు. తండ్రీ, కొడుకులు కలిసి ఆయన్ను రాజకీయంగా అంతం చేస్తారు అంటూ మైండ్ గేమ్ ఆడారు యడ్యూరప్ప. ఓవైపు సిద్ధారామయ్య, మరోవైపు శివకుమార్‌లపై తన జాలిని చూపించే ప్రయత్నం చేశారు. కుమార స్వామి చరిత్ర అంతా తెలుసు. గతంలో ఆయనతో కలిసి పనిచేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు.

జేడీఎస్ ఇచ్చిన హామీలను సభలో ప్రస్తావించారు యడ్యూరప్ప. 24 గంటల్లోగా రైతు రుణాలు మాఫీ చేయాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోలేమంటూ కబుర్లు చెబితే ఊరుకునేది లేదన్నారు. రుణమాఫీని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వంపై పోరాడటమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు యడ్యూరప్ప.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.