యాప్నగరం

ఈ ట్విస్ట్ ఏందప్పా... యడియూరప్ప నిర్ణయంతో ఇరకాటంలో బీజేపీ

గవర్నర్‌ పదవి ఇవ్వజూపినా తాను స్వీకరించబోననే సంకేతాలను యడియూరప్ప పరోక్షంగా అధిష్ఠానం పెద్దలకు పంపించారు. ఆయన నిర్ణయం బీజేపీ అధిష్ఠానం పెద్దలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.

Samayam Telugu 28 Jul 2021, 2:11 pm

ప్రధానాంశాలు:

  • క్రియాశీలక రాజకీయాల్లోనే కొనసాగాలని యడ్డీ నిర్ణయం
  • గవర్నర్ పదవిని తిరస్కరించిన మాజీ ఎంసీ
  • ఇరకాటంలో బీజేపీ అధిష్ఠానం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu యడ్యూరప్ప
యడియూరప్ప రాజీనామాతో ఖాళీ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని బసవరాజ్ బొమ్మై నేడు అధిష్ఠించనున్నారు. సీఎం రేసులో అనేక మంది నేతలు పోటీ పడినా చివరికి బసవరాజ్‌నే అదృష్టం వరించింది. యడ్డీ సూచన మేరకు లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజునే సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే ఇప్పుడు యడియూరప్ప భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అధిష్ఠానం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన యడియూరప్ప క్రియాశీలక రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు గానీ పశ్చిమబెంగాల్‌కు గానీ గవర్నర్‌గా వెళ్లాలని బీజేపీ అధిష్ఠానం యడియూరప్పకు ఆఫర్‌ ఇచ్చినా ఆయన సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం. తనకు ఏ రాష్ట్రానికీ గవర్నర్‌గా వెళ్లే ఆలోచన లేదని, తనపై ఒత్తిడి తీసుకురావద్దని ఆయన బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి తనను కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానించినా తాను సున్నితంగానే తిరస్కరించానని సోమవారం రాజీనామా అనంతరం బెంగళూరులో ఆయన మీడియాకు చెప్పారు.

దీంతో గవర్నర్‌ పదవి ఇవ్వజూపినా తాను అంగీకరించబోననే సంకేతాలను ఆయన పరోక్షంగా అధిష్ఠానం పెద్దలకు పంపినట్లయింది. అయితే యడియూరప్ప క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకోవడం అధిష్ఠానం పెద్దలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కొనసాగితే నూతన ముఖ్యమంత్రికి తలనొప్పులు తప్పవని భావిస్తున్నారు. తన కొడుకు విజయేంద్రకు మంచి రాజకీయ భవిష్యత్తును అందించాలన్న కృతనిశ్చయంతోనే యడ్డీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.