యాప్నగరం

ఆ విషయంలో మోదీ, షాని దాటేసిన యోగి ఆదిత్యనాథ్

ఇటీవల జరిగిన ఐదు రాష్టా్ల ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరపున అత్యధిక సభల్లో పాల్గొన్నారు.

Samayam Telugu 8 Dec 2018, 12:57 pm
భారతీయ జనతా పార్టీలో అద్వానీ, వాజ్‌పేయి తరం తర్వాత ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు మోదీ, అమిత్‌ షా. భాజపా అంటే వీరిద్దరే అన్నంతగా పార్టీలో దూసుకుపోతున్నారు. 2014లో భాజపా ప్రభంజనం తర్వాత పార్టీలో మోదీ ఏం చెబితే అదే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. దీనికి తోడు ఆయన మిత్రుడు అమిత్ షాకు పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆ ద్వయానికి తిరుగన్నదే లేకుండా పోయింది. అప్పట్నుంచీ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పార్టీ తరపున వారిద్దరే స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా రాష్ట్రాల శాఖలు సైతం మోదీ, షాతో సభలు నిర్వహిస్తే విజమం తథ్యమన్న ఆలోచనతో ఉంటున్నాయి.
Samayam Telugu Yogi-Adityanath


అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ, అమిత్ షా కంటే మరో వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయనే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అనూహ్య పరిస్థితుల్లో యూపీ సీఎం పీఠంపై కూర్చున్న యోగి.. ఆ తర్వాత తన పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన చేపట్టిన పథకాలు, పాలనలో తీసుకొచ్చిన మార్పులపై చాలా రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ మరో అస్త్రంగా వినియోగించుకుంటోంది.

ఇటీవల జరిగిన ఐదు రాష్టా్ల ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరపున అత్యధిక సభల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌లో 26, ఛత్తీస్‌గఢ్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 17, తెలంగాణలో 8 సభల్లో కలుపుకొని ఆయన మొత్తం 74 చోట్ల ప్రచారం నిర్వహించిననట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మోదీ 32, అమిత్ షా 58 ర్యాలీల్లో మాత్రమే పాల్గొన్నట్లు తెలిపాయి. మోదీ అత్యధికంగా రాజస్థాన్‌లో 12 సభల్లో పాల్గొంటే, షా.. మధ్యప్రదేశ్‌లో 23 మీటింగుల్లో పాల్గొని ప్రసంగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి తీసుకొచ్చిన మోడల్ గవర్నెన్స్ విజయవంతం కావడంతో భాజపా ఆయన్ని స్టార్ క్యాంపెయినర్‌గా వినియోగించుకుంటోందని బీజేపీ ప్రతినిధి చంద్రమోహన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.