యాప్నగరం

కశ్మీర్‌లో మరో భారీ విజయం.. అల్‌ఖైదా చీప్ సహా ముగ్గురు ముష్కరులు హతం

సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మూడు రోజుల కిందట జరిపిన మెరుపు దాడుల్లో 60 వరకు ఉగ్రవాదులు, 10 వరకు పాక్ సైనికులు హతమయ్యారు.

Samayam Telugu 23 Oct 2019, 3:13 pm
జమ్మూ కశ్మీర్‌లో సైన్యానికి మరో భారీ విజయం దక్కింది. ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా త్రాల్‌ సెక్టార్‌లో ముగ్గురు ముష్కరులను భారత సైన్యం మంగళవారం హతమార్చినట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. భారత భద్రతా దళాల కాల్పుల్లో అల్‌ఖైదా కశ్మీర్ విభాగం అధినేత జకీర్ ముసా వారసుడు హతమైనట్టు పేర్కొన్నారు. అన్సార్‌ ఘజ్వాత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌ అబ్దుల్ హమీద్‌ లేల్హారీ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగస్టు 29న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గుజ్జర్ సోదరులు హతమయ్యారు. వీరిపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దర్ని మంగళవారం త్రాల్ సెక్టార్‌లో సైన్యం హతమార్చిందని వివరించారు.
Samayam Telugu HameedLahir


ఈ ఏడాది మే 23న పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్సార్‌ ఘజ్వాత్‌ అధినేత జాకీర్‌ మూసాను సైన్యం మట్టుబెట్టింది. తర్వాత మూసా వారసుడిగా హమీద్‌ లేల్హారీని బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం అవంతిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్ లేల్హారీ సహా అతడి ఇద్దరి అనుచరులను భారత సైన్యం హతమార్చింది. అంతకుముందు అనంత్‌నాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. అవంతిపొరలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించింది. గతేడాది పంజాబ్‌లోని జలంధర్ వరుస బాంబు పేలుళ్లతో లేల్హారీకి సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నిర్ధరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.