యాప్నగరం

జనం నెత్తిన మరో పిడుగు.. పెట్రోల్, డీజిల్‌‌పై లీటర్‌కు రూ.35 పెంపు.. !

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దాయాది పాకిస్థాన్.. కష్టాల నుంచి బయటపడేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి రుణాలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంటోంది. సంక్షోభం నుంచి బయటపడాలంటే ఐఎంఎఫ్ విధించిన కఠిన షరతులకు తలొంచక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఆహార కొరత, విద్యుత్‌ సంక్షోభం, కొండెక్కిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజల నెత్తిన మరో భారం వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఇంధన ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 Jan 2023, 11:07 am

ప్రధానాంశాలు:

  • పాక్‌ను వెంటాడుతున్న తీవ్ర ఆర్ధిక కష్టాలు
  • నిత్యావసరాలు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు
  • భారీగా పతనమైన పాకిస్థాన్ రూపాయి విలువ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pakistan Crisis
దేశంలో నెలకున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు దాయాది పాకిస్థాన్ కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే మంత్రుల విదేశీ ప్రయాణాలు, లగ్జరీ కార్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఆహార కొరత, విద్యుత్‌ సంక్షోభం, కొండెక్కిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజల నెత్తిన మరో భారం వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచింది. లీటర్‌కు ఏకంగా రూ.35 చొప్పున వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఆదివారమే అమల్లోకి వచ్చినట్లు పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు కిరోసిన్‌, లైట్‌ డీజిల్‌ ధరలను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున వడ్డించింది.
ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.249.80కి చేరగా.. హైస్పీడ్‌ డీజిల్‌ రూ.262.80కు చేరింది. కిరోసిన్‌ రూ.189.83, లైట్‌ డీజిల్‌ రూ.187కు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌‌పై రూ.50 పెంచుతారని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండగానే రూ.35 పెరిగింది. ధరల పెంపుతో పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు పెద్దఎత్తున బారులు తీరారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును పాక్ ఆర్ధిక మంత్రి సమర్దించుకున్నారు. ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్దేశించడంతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, లైట్ డీజిల్‌ ధరలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. నాలుగు నెలలుగా వీటి ధరలు పెరగలేదని, నిలకడగా ఉన్నాయన్నారు. అంతేకాదు, నిజానికి డీజిల్, కిరోసిన్ ధరలు తగ్గాయని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సాయమే దిక్కు. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల అంగీకరించారు. ఐఎంఎఫ్ నిధుల కోసం ఎంత కఠినమైన ఆంక్షలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఐఎంఎఫ్‌ నిధులు విడుదల చేయకపోతే.. 2019లో మంజూరైన 6 బిలియన్‌ డాలర్లు రద్దయిపోతాయి. అందుకే పాక్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు స్పష్టం అవుతోంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి రుణాలు పొందేందుకు రూపాయి మారకపు రేటుపై నిబంధనను సరళతరం చేసింది. దీని కారణంగా డాలరుతో పాక్‌ రూపాయి మారకపు విలువ ఊహించని రీతిలో పతనమయి 255కి పడిపోయింది. ఇంత పెద్దమొత్తంలో పాక్ రూపాయి పతనం కావడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. రూపాయిపై నియంత్రణలను సరళీకరించాలని, మారకపు విలువను మార్కెట్‌ నిర్ణయించేలా చూడాలని పాకిస్థాన్‌‌కు ఐఎంఎఫ్‌ పలు షరతులు విధించింది. దీంతో గత్యంతరం లేక దాయాది తలొగ్గింది.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.