యాప్నగరం

Coronavirusను చైనీస్ వైరస్‌గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా, చైనా పరస్పర విమర్శలు

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రచారం జోరుగా సాగుతోంది.

Samayam Telugu 18 Mar 2020, 10:54 am
కరోనా వైరస్‌ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గతవారం ఆరోపణలు గుప్పించగా.. వైరస్ విజృంభణకు సంబంధించిన నిందను తమ మీదకు మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తోందని అమెరికా తిప్పికొట్టింది. తాజాగా, మరోసారి వైరస్ విషయమై చైనా, అమెరికాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. కోవిడ్ 19ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘చైనీస్‌ వైరస్‌’గా అభివర్ణించారు. ‘కరోనా’కు అమెరికాయే కారణమంటూ చైనా నిందలు వేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విరుచుకుపడ్డారు.
Samayam Telugu china


దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఈ వైరస్‌ను అమెరికా సైన్యమే చైనాకు తీసుకొచ్చి ఉండవచ్చని ఆరోపించారు. చైనాలో కంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రకటించిన రోజే అమెరికా-చైనాలు పరస్పరం విమర్శలకు దిగాయి.

కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కొత్త కరోనావైరస్‌ను ‘చైనా వైరస్’' అని అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం ఒక ట్వీట్ చేశారు. అయితే, ఈ వైరస్‌ను ఏదైనా నిర్దిష్ట ప్రాంతానికి లేదా సమూహానికి ఆపాదించవద్దని.. అలా చేయడం వల్ల ఆ ప్రాంతం లేదా సమూహం పట్ల వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది. అయినా సరే అమెరికా అధికారులు కొందరు ఈ వైరస్‌ను చైనీస్ వైరస్ అని ఉటంకిస్తున్నారు. విదేశాంగ మంత్రి పాంపేయే ఈ వైరస్‌ను ‘వుహాన్ వైరస్’ అని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా, మూడు అమెరికా దినపత్రికలకు సంబంధించిన జర్నలిస్ట్‌ల గుర్తింపును చైనా మంగళవారం రద్దుచేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌లకు చెందిన అమెరికా జర్నలిస్ట్‌ గుర్తింపు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరిలోనే వాల్‌స్ట్రీట్ జర్నల్‌‌కు చెందిన ముగ్గురు జర్నలిస్ట్‌ల ఇద్దరు అమెరికన్లు, ఒకరు ఆస్ట్రేలియన్‌ను చైనా తమ దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిపై కథనం ప్రచురించిన వాల్‌స్ట్రీట్ జర్నల్. ‘రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా’గా పేర్కొంటూ ఒపీనియన్ కాలమ్ రాయడంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కథనం జాత్యహంకార ధోరణికి అద్దం పడుతోందని, తక్షణమే క్షమాపణ చెప్పాలని చైనా డిమాండ్ చేసినా, వాల్‌స్ట్రీట్ జర్నల్ అందుకు అంగీకరించలేదు. దీంతో తమ దేశంలోని ఆ పత్రికకు సంబంధించిన ముగ్గురు జర్నలిస్ట్‌లను గెంటేసింది. డ్రాగన్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన అమెరికా... పత్రికా స్వేచ్ఛను చైనా హరిస్తోందని ఆరోపిస్తోంది.

ఇదిలా ఉండగా వాషింగ్టన్‌లో చైనా అధికారిక మీడియా సంస్థల కార్యాలయాలలో పనిచేసే ఆ దేశ పౌరుల సంఖ్యను 160 నుంచి 100కు కుదించిందని, ఇది డ్రాగన్ దేశంలోని పత్రికా స్వేచ్ఛ అణిచివేత తీవ్రతను తెలియజేస్తుందని అమెరికా దుయ్యబట్టింది. అమెరికా తమపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చిన చైనా.. అమెరికా జర్నలిస్ట్‌ల గుర్తింపు ఇప్పటికే ముగిసిందని, అందుకే తమ దేశంతోపాటు హాంకాంగ్, మకావులో విధులు నిర్వహించడానికి అనుమతించడంలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, వారి గుర్తింపు కార్డులను పది రోజుల్లోగా వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.