యాప్నగరం

బ్రెజిల్ సంచలన నిర్ణయం.. భారతీయులకు వీసా అవసరం లేదని ప్రకటన!

దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ పర్యటకం, వ్యాపారాన్ని మరింత ప్రోత్సహించేందుకు, విదేశీయులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, భారతీయ పర్యాటకులకు వీసా అవసరం లేదని ప్రకటించింది.

Samayam Telugu 25 Oct 2019, 11:08 am
భారతీయులకు వీసా విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ పౌరులకు ఇకపై వీసాలు అవసరం లేదని గురువారం ప్రకటించారు. తమ దేశంలో పర్యటించే చైనా, భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు వీసాలు పొందాలనే నిబంధనను తాము పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గురువారం స్పష్టం చేశారు. మితవాద రాజకీయ నేతగా గుర్తింపు పొందిన బోల్సోనారో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన బ్రెజిల్ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టారు.
Samayam Telugu brazil


అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా నిబంధనలు సడలిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ, చైనా అధికార పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల పౌరుల వీసాకు సంబంధించిన విధానం గురించి తొలిసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు వీసాతో పనిలేదని లేదని బ్రెజిల్ ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, దీనికి ప్రతిఫలంగా ఆ దేశాలు బ్రెజిల్ పౌరులకు వీసా నిబంధనల్లో ఎలాంటి సడలింపులు చేయకపోవడం విశేషం.

అగ్రరాజ్యం అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండగా, దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ మాత్రం ఏకంగా వీసా అవసరం లేదని ప్రకటించింది. వ్యక్తిగత వివరాలతో పాటు తాము వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలనూ కూడా అందజేయాలని అమెరికా ఈ జూన్‌లోనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. తాత్కాలిక పర్యాటకులతో పాటు దాదాపు అన్ని వీసా దరఖాస్తులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకోసం డ్రాప్ డౌన్ మెనూను అందుబాటులోకి తెచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.