యాప్నగరం

‘కశ్మీర్’పై ఇమ్రాన్‌కు షాక్ ఇచ్చిన పాక్ ప్రజలు.. సర్వేలో ఆసక్తికర ఫలితం!

కశ్మీర్ అంశాన్ని బూచిగా చూపి పబ్బం గడుపుకుంటున్న పాకిస్థాన్ పాలకులకు ఆ దేశ ప్రజలు షాక్ ఇచ్చారు. తమకు కశ్మీర్ అంశం ఓ సమస్యే కాదని ఓ సర్వేలో తేల్చిచెప్పారు.

Samayam Telugu 2 Nov 2019, 12:38 pm
పాకిస్థాన్ ప్రజలు కశ్మీర్ అంశానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఓ సర్వేలో వెల్లడయ్యింది. దీనిని వారు పెద్దగా పట్టించుకోవడంలేదని గాలప్- గిలానీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యయనంలో స్పష్టమయ్యింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రధాన సమస్య అని జనం ముక్తకంఠంతో వెల్లడించారు. ధరలను నియంత్రించడంలోనూ, ఉద్యోగ కల్పనలోనూ ప్రధాని ఇమ్రాన్ ఘోరంగా విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. పాకిస్థాన్‌లో వాస్తవ పరిస్థితులకు గాలప్ సర్వే ఫలితాలు అద్దంపడుతున్నాయి.
Samayam Telugu imran


ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు 53 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. 23శాతం మంది నిరుద్యోగాన్ని, 4 శాతం మంది అవినీతిని, మరో 4 శాతం మంది ప్రజలు నీటి కొరతను సమస్యగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. రాజకీయ అస్థిరత, డెంగీ విజృంభణపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్‌ను సమస్యగా భావిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని తరుచూ ప్రస్తావిస్తూ రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్‌ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజల నుంచి మద్దతులేదనేది తేటతెల్లమయ్యింది. కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతుగా నిలవడం ఇమ్రాన్‌కు ఒక రకంగా చెంపపెట్టేనని చెప్పాలి.

బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్ నాలుగు ప్రావిన్సుల్లోని పురుషులు, మహిళల అభిప్రాయాలను ఈ సర్వేలో తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా పాక్ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్ఠానికి చేరుకోగా, ధరలు ఆకాశానంటుతున్నాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణ స్థితికి చేరుకుందని.. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గత జులైలో ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. జులై నాటికి పాక్‌ వద్ద కేవలం 8 బిలియన్‌ డాలర్ల నిధులే ఉండగా, అవి కేవలం 1.7 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో 6 బిలియన్‌ డాలర్ల బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీతో పాక్‌కు ఐఎంఎఫ్ అండగా నిలిచింది. అలాగే చైనాతోపాటు గల్ఫ్ దేశాలూ సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్‌కు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితిపై దిగ్గజ వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులతో గత నెలలో పాక్ ఆర్మీ చీఫ్ ప్రైవేటుగా సమావేశమయ్యారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లేకుండానే ఈ సమావేశం జరగడం విశేషం. ప్రధాని లేకుండా ఒక ఆర్మీ చీఫ్‌ ఇలాంటి సమావేశం నిర్వహించడమంటే ఆర్మీ కనుసన్నల్లోనే పాలన సాగుతుందనే నగ్న సత్యం బయటపడింది. పాక్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పాక్ ఆర్మీ చీఫ్ సూచనలు అడగటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.