యాప్నగరం

‘ఐసిస్ అధినేత బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు.. నేను స్వయంగా చూశాను’

ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్ర నేత అబు బకర్‌ ఆల్‌ బాగ్దాదీని అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో హతమార్చింది. సిరియాలో ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్‌లో అతడు ఆత్మాహుతి చేసుకున్నాడు.

Samayam Telugu 28 Oct 2019, 10:44 am
ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్-బాగ్దాదీ మరణవార్తపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. సిరియాలో అమెరికా సేనలు చుట్టుముట్టడంతో బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని, ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని తాను వీక్షించానని ట్రంప్ తెలిపారు. ఐఎస్ అధినేత మరణ వార్తలు వెలువడిన కొద్ది గంటల తర్వాత ఆయన వైట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. బాగ్దాదీ మృతి గురించి శనివారం రాత్రి పరోక్షంగా ట్విట్టర్ ద్వారా పరోక్షంగా వెల్లడించిన ట్రంప్, వైట్ హౌజ్‌లో మీడియా దానిని ధ్రువీకరించారు. తమ సైన్యం చుట్టుముట్టడంతో బాగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడని, డీఎన్‌ఏ పరీక్షలు సైతం అతడి మృతిని ధ్రువీకరించాయని ట్రంప్ స్పష్టం చేశారు.
Samayam Telugu ischief


బాగ్దాదీతో పాటు అతడి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు చనిపోయారని, అయితే తమ సైనికుల్లో ఎవరికీ ప్రాణహాని జరగలేదని ట్రంప్ అన్నారు. ఐసిస్‌కు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. దాడి సమయంలో బాగ్దాదీ సొరంగంలో దాక్కున్నాడని ఈ ఆపరేషన్ రెండు గంటల పాటు సాగిందని ప్రకటించారు. బాగ్దాదీ మృతికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించిన ట్రంప్.. భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అమెరికా బలగాలను ఎదుర్కోలేననే భయంతోనే తనను తాను బాంబుతో పేల్చుకుని మరణించాడని వివరించారు.

పేలుడు వల్ల అతడి శరీరం తునాతునకలైందని, డీఎన్ఏ టెస్టుల ద్వారా దీనిని ధ్రువీకరించామని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రత్యేక దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌కు రష్యా, ఇరాక్, టర్కీ, సిరియా, సిరియాలోకి కుర్దులు సహకరించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌కు రెండు వారాలు వ్యూహరచన చేశామని, తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే బాగ్దాదీని మట్టుబెట్టడానికి పలు సూచనలు చేసినట్టు ట్రంప్ తెలియజేశారు.

బాగ్దాదీని పట్టుకోవడం లేదా హతమార్చడమే అమెరికా సేనలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, ప్రత్యేక ఆపరేషన్ దళాలు వాయువ్య సిరియాలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సాహసోపేతమైన ఆపరేషన్ సమర్ధంగా పూర్తిచేశాయని అన్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయడమే అమెరికా సహా అన్ని దేశాల లక్ష్యమని అన్నారు. శ్వేతసౌధంలోని సిట్యుయేషన్ రూమ్ నుంచి ఉపాధ్యాక్షుడు మైక్ పెన్స్, డిఫెన్స్ సెక్రటరీ మైక్ స్పర్‌తో కలిసి మొత్తం ఆపరేషన్‌ను వీక్షించినట్టు తెలిపారు. అమెరికా సేనల ఆపరేషన్‌లో బాగ్దాదీ అనుచరులు పెద్ద సంఖ్యలో హతమయ్యారని ట్రంప్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.