యాప్నగరం

లంకేయుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం… ఈ ప్రభుత్వం మాకొద్దంటున్న ప్రజలు

శ్రీలంకంలో ఆందోళన ఉధృతస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. తమకు మంచి భవిష్యత్తు కావాలంటూ నినదిస్తున్నారు. ప్రధాని, అధ్యక్షుడుల వల్ల ఉపయోగం లేదని, వారిని రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఇది అవినీతి ప్రభుత్వమని, ఈ ఈ ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ బాగుపడదని విమర్శిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు శ్రీలంక ప్రభుత్వం నిధుల సమీకరణకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

Produced byAndaluri Veni | Samayam Telugu 17 Apr 2022, 11:10 am

ప్రధానాంశాలు:

  • శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
  • బీచ్ ఫ్రంట్‌లోని గాల్‌ఫేస్‌లో నిరసనలు
  • మంచి భవిష్యత్తు కావాలంటూ నినాదాలు
  • ప్రభుత్వం ఉన్నా ఉపయోగం లేదంటూ విమర్శలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. నిత్యావసరాల కొరత, పెరిగిన ధరలు, విద్యుత్‌ కోతలతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా రాజధాని కొలంబోలోని ప్రధాన బీచ్ ఫ్రంట్‌లోని గాల్‌ఫేస్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసన తెలుపుతున్నారు. ప్రధాని మహీందా రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సేలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వారిని రాజీనామా చేయాలని, వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు మంచి భవిష్యత్తు కావాలంటూ నినదిస్తూ ప్లకార్డులు, బ్యానర్లతో చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రదర్శనలో భాగం అయ్యారు.

అలసిపోయాం.. మాకొద్దు ఈ పాలన..

ఈ ప్రభుత్వంతో అలసిపోయామని, ప్రధానమంత్రి మహింద రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సలతో దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని నిరసనకారులు అంటున్నారు. వారిద్దరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని, వారు ఇక్కడున్నంత కాలం ఆర్థిక వ్యవస్థ బాగుపడదని విమర్శించారు. అధికారంలో ఉన్న వారికి ఎలాంటి ప్రణాళిక లేదని, దేశాన్ని ఎలా నడిపించాలో తెలియదని ఎద్దేవ చేశారు. రాజపక్సే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, వారిని తొలగించి మా రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం అని అంటున్నారు.

ఐదు రోజులు ట్రేడింగ్‌కు బ్రేక్

మరోపక్క శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే విదేశీ అప్పులను తీర్చలేమని ప్రభుత్వం చేతుల ఎత్తేసింది. ఖజానా ఖాళీ అవ్వడంతో రుణాలను చెల్లించలేమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్ ఏప్రిల్ 18 నుంచి ఐదు రోజుల పాటు ట్రేడింగ్ జరగదని శనివారం వెల్లడించింది. దేశ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ గండం నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిధుల సమీకరణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు బిలియన్ డాలర్ల సాయం కోసం శ్రీలంక ప్రతినిధులు వాషింగ్టన్‌‌ను ఆశ్రయించారు.

కోటా పద్ధతిలో పెట్రోల్, డీజిల్

ఇదిలాఉండగా శ్రీలంక పెట్రోలియం కంపెనీలు ఇంధన కోటా పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. రేషన్ విధానాన్ని అవలంబిస్తున్నట్టు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటనలో తెలిపింది. దీనిప్రకారం ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్‌ల్లో కేవలం వెయ్యి రూపాయల వరకు ఇంధనాన్ని మాత్రమే పొందుతారు. ఆటో డ్రైవర్లు రూ.15 వందలు, కార్లు, జీపులు, వ్యాన్‌ల వాహనదారులు రూ.5 వేల వరకు ఇంధనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అయితే రేషన్ పద్ధతిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రోజంతా విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు అవస్థలుపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి చోటుచేసుకుంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.