యాప్నగరం

మోడెర్నా కోవిడ్-19 టీకా యాంటీబాడీల జీవితకాలం మూడు నెలలే!

అమెరికాకు చెందిన మోడెర్నా ఫార్మ సంస్థ కరోనా వైరస్‌కు టీకాను తయారుచేసిన విషయం తెలిసిందే. ఈ టీకా అత్యవరసన వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్వయిజరీకి దరఖాస్తు చేసింది.

Samayam Telugu 4 Dec 2020, 10:24 am
కరోనా వైరస్‌కు తాము అభివృద్ధి చేసిన టీకా 94 శాతం ప్రభావం చూపినట్టు ప్రకటించిన మోడెర్నా.. దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించాలని దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కనీసం మూడు నెలల పాటు ఉంటాయని తాజా అధ్యయనం తెలిపింది. మోడెర్నా టీకా అభివృద్ధిలో పాల్గొన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అలర్జీస్‌ అండ్‌ ఇన్ఫక్టియస్ డిసీజెస్‌(ఎన్‌ఐఏఐడీ) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. టీకా ప్రయోగాల్లో పాల్గొన్న 34 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిలో యువకుల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు.
Samayam Telugu మోడెర్నా టీకా
File Photo


వీరంతా తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ అధ్యయన ఫలితాలను ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురించారు. సార్స్‌-కొవ్‌-2 వైరస్‌పై పోరాడే యాంటీబాడీలు ఊహించినట్లుగానే కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయినట్లు గమనించామని స్పష్టం చేశారు. అయితే, దాదాపు అందరిలోనూ కనీసం మూడు నెలల వరకు ఇవి క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏ-1273 పేరిట తయారు చేసిన ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండు డోస్‌లు చొప్పున ఇచ్చారు.

యాంటీబాడీలు క్షీణించడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్ఐఏఐడీ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో యాంటీబాడీల సమాచారం నిక్షిప్తమై ఉంటుందని పేర్కొన్నారు. రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు టీకా ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీల సమాచారాన్ని గుర్తుంచుకుని స్పందించడాన్ని అధ్యయనంలో గుర్తించామని పరిశోధకులు వివరించారు.

తర్వాతి కాలంలో ఎప్పుడైనా కరోనా వైరస్ సోకినా వెంటనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని.. అయితే, ఈ ప్రక్రియపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అత్యవసర వినియోగం కోసం తమ టీకాను అనుమతించాలంటూ మోడెర్నా చేసుకున్న దరఖాస్తుపై డిసెంబరు 17న ఎఫ్‌డీఏ నిర్ణయం వెలువడనుంది. అటు, ఫైజర్‌-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాకు సైతం అనుమతులు రావాల్సి ఉంది. బ్రిటన్‌లో ఇప్పటికే ఈ టీకాకు అనుమతి లభించగా.. వచ్చే వారం నుంచి ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.