యాప్నగరం

కరాచీ గగనతలంపై పాక్ ఆంక్షలు

కరాచీ నగరంపై 33 వేల కంటే తక్కువ ఎత్తున విమానాలు ఎగరడంపై పాక్ నిషేధం విధించింది. ఈ నిర్ణయ ప్రభావం గల్ఫ్ వెళ్లే భారత విమానయాన సంస్థలపై పడనుంది.

TNN 27 Sep 2016, 1:59 pm
 భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లోని ప్రధాన నగరమైన కరాచీ మీదుగా తక్కువ ఎత్తులో విమానాలు ఎగరడాన్ని ఆ దేశం నిషేధించింది. గుజరాత్, రాజస్థాన్‌లకు సమీపంలో ఉండే కరాచీ నగరం మీదుగా భారత్ నుంచి గల్ఫ్‌కు పలు అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కరాచీ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌ (ఎఫ్‌ఐఆర్)లో 33 వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులో విమానాలు ఎగరకుండా సోమవారం రాత్రి పాక్ నోటీస్ టూ ఎయిర్‌మెన్ (నోటమ్) జారీ చేసింది. దీని వల్ల గల్ఫ్ నుంచి మధ్య భారతం, ఈశాన్య భారతానికి రాకపోకలు సాగించే విమానాలు కరాచీ ప్రాంతంలో 33 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇరాన్ మీదుగా లేదా ఆఫ్గాన్ మీదుగా ఢిల్లీ ఎఫ్‌ఐఆర్‌కు చేరాల్సి ఉంటుంది.
Samayam Telugu pakistan bars low flying aircraft over karachi airspace
కరాచీ గగనతలంపై పాక్ ఆంక్షలు

యూరీ ఘటన తర్వాత పాక్ తన గగన తలంపై ప్రయాణించే విమాలపై ఆంక్షలు విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బుధవారం గిల్గిత్- బల్టిస్థాన్ ప్రాంతంలో విమానాల ప్రయాణంపై ఆ దేశం ఆంక్షలు విధించింది. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో భారత విమానాలు పాక్ గగన తలం మీదుగా ప్రయాణాన్ని ఆపేశాయి. పశ్చిమ దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ మీదుగా కాకుండా చుట్టూ తిరుగుతూ వెళ్లాయి. కరాచీ ఎఫ్‌ఐఆర్ దాటిన తర్వాత నాగపూర్, భువనేశ్వర్‌లకు ప్రయాణించాల్సిన విమానాలు అహ్మదాబాద్ ఎఫ్‌ఐఆర్ గుండా భారత్‌లోకి అడుగుపెడతాయి. అహ్మదాబాద్ ఎఫ్‌ఐఆర్ నుంచి అరేబియా సముద్రం మీదుగా నేరుగా గల్ఫ్ దేశాలకు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని యూరీ దాడులకు ముందే స్పైస్‌ జెట్ లాంటి విమానయాన సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరాయి. ఇలా ప్రయాణించడం వల్ల విమానాలకు ఇంధనం, సమయం రెండూ ఆదా అవుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.