యాప్నగరం

షరీఫ్ అనర్హుడు... పాక్ సుప్రీంకోర్టు

పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని అనర్హుడిగా పేర్కొంటూ పాక్ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది.

TNN 28 Jul 2017, 1:02 pm
పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని అనర్హుడిగా పేర్కొంటూ పాక్ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో నవాజ్ షరీఫ్ అధికార పీఠం నుంచి దిగిపోవాల్సిందే. పనామా పేపర్ల ద్వారా ఆయనపై వచ్చిన ఆరోపణలపై పాక్ సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 1990లో షరీఫ్ పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమ సంపాదనతో లండన్ లో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారని, ఆయన కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఈ ఆస్తులను కొనుగోలు చేశారని పనామా పేపర్ల ద్వారా లీక్ అయింది.
Samayam Telugu panama papers hearing pakistan pm nawaz sharif disqualified in unanimous verdict
షరీఫ్ అనర్హుడు... పాక్ సుప్రీంకోర్టు


ఈ ఆరోపణల నేపథ్యంలో షరీఫ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నివేదికను కోర్టుకు సమర్పించింది. అలాగే దీనిపై ఆరుగురు సభ్యుల జేఐటీ కూడా నివేదికను జులై 10 కోర్టుకు నివేదించింది. ఈ నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం నవాజ్ షరీఫ్‌ను అనర్హుడిగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది. జేఐటీ ముందు గత జూన్ 15 న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఇలాంటి విచారణకు హాజరైన మొదటి ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఇద్దరు కుమారులు హసన్‌, హుస్సేన్‌ కూడా జులై 3, 4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. పెద్ద కుమారుడైన హసన్‌ను ఆరుసార్లు జేఐటీ విచారించింది. వీరితోపాటు నవాజ్‌ షరీఫ్‌ బంధువు తారిఖ్‌ షఫీను కూడా రెండోసారి జులై 2 న విచారించారు.

మనీలాండరింగ్‌ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్‌ షరీఫ్‌ కుటుంబం లండన్‌ నగరం పార్క్‌లేన్‌ ఏరియాలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 20 వ తేదీన ఈ కేసును విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రితో పాటు ఆయన కుమారులను.. ఇంకా సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించే అధికారం కల్పిస్తూ జేఐటీని ఏర్పాటు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.