యాప్నగరం

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై విచారణకు ఆదేశించిన పాక్ సుప్రీం కోర్టు

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశంలోనే చిక్కుల్లో పడ్డారు. ఇటీవలే పనామా పేపర్స్ లీక్ వ్యవహారం తర్వాత షరీఫ్...

TNN 1 Nov 2016, 6:38 pm
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశంలోనే చిక్కుల్లో పడ్డారు. ఇటీవలే పనామా పేపర్స్ లీక్ వ్యవహారం తర్వాత షరీఫ్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అతడిపై పాక్ సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. కేబినెట్ మంత్రులు, పిటిషనర్ల తరపు న్యాయవాదులు, సీనియర్ పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్) నేతలు, మీడియా సమక్షంలో చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలి నేతృత్వంలో జస్టిస్ అసిఫ్ సయీద్ ఖాన్ ఖోసా, జస్టిస్ అమీర్ హనీ ముస్లిం, జస్టిస్ షేక్ అజ్మత్ సయీద్, జస్టిస్ ఇజాజుల్ అహ్సన్‌లు చేపట్టిన విచారణలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. సుప్రీం కోర్టు అధికారాలు కలిగివుండేలా ఒక జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌ని నియమించడానికి సైతం సిద్ధంగా వున్నట్టు ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. విచారణ బృందానికి తమ సూచనలు అందజేయాల్సిందిగా ప్రభుత్వానికి, పిటిషనర్లకి కోర్టు తేల్చిచెప్పింది. రోజువారీగాను విచారణ చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తచేసిన కోర్టు.. ఈ పిటిషన్ విచారణని గురువారానికి వాయిదా వేసింది.
Samayam Telugu panama papers leaks pakistan pm nawaz sharif to face pak supreme court probe
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై విచారణకు ఆదేశించిన పాక్ సుప్రీం కోర్టు


ప్రధానిపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించడంపై స్పందించిన పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్... అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటంలో తనతో కలిసి వస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తన మద్దతుదారులంతా రేపు ఇస్లామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే థాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇకనైనా విచారణ చేపడుతున్నందుకు తనకి ఎంతో సంతోషంగా వుంది అని అన్నారు ఇమ్రాన్. అయితే, ఈ విచారణ పారదర్శకంగా జరగాలంటే నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు ఇమ్రాన్.

ఇదిలావుంటే, షరీఫ్ నలుగురు పిల్లల్లో ముగ్గురైన మర్యం, హసన్, హుస్సేన్‌లకి విదేశాల్లో కంపెనీలు వున్నట్టుగా పేర్కొన్న పనామా పేపర్స్... ఆయా కంపెనీలకు వారు యజమానులుగా వున్నట్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. పనామా పేపర్స్ లీక్ వెలుగులోకి తీసుకువచ్చిన అంశాలని ప్రస్తావిస్తూ షరీఫ్‌పై విచారణకు ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలోనే షరీఫ్‌కి వ్యతిరేకంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.