యాప్నగరం

Kim Jong Un ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం ఇదే.. కిమ్ కీలక ప్రకటన

Kim Jong Un ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఉత్తర కొరియా వరుస ఖండాతర క్షిపణులను ప్రయోగించి కలవరానికి గురిచేస్తోంది. దక్షిణ కొరియాకు మద్దతిస్తున్న అమెరికా.. కొరియా ద్వీపకల్పం లక్ష్యంగా వ్యూహాత్మక బాంబర్లను మోహరించింది. ఇదే సమయంలో కొరియా ద్వీపకల్పం చుట్టూ అమెరికా, దక్షిణ కొరియా చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలను నిరసిస్తూ ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తూ హెచ్చరికలు పంపుతోన్న విషయం తెలిసిందే.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 Nov 2022, 7:25 am

ప్రధానాంశాలు:

  • వరుస క్షిపణి ప్రయోగాలతో హడలెత్తిస్తోన్న ఉత్తర కొరియా
  • హస్వాంగ్ 17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు
  • శాస్త్రవేత్తలను అభినందించిన కిమ్ జోంగ్ ఉన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kim Jong Un
Kim Jong Un గత నెల రోజులుగా వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను ఉత్తర కొరియా (North Korea) ఆందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస క్షిపణి ప్రయోగాలపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే తమ అంతిమ లక్ష్యమని కిమ్ ఉద్ఘాటించారు. అతిపెద్ద బాలిస్టిక్‌ ఖండాంతర క్షిపణి హాస్వాంగ్-17 పరీక్షలో భాగమైన సైనిక అధికారులను తాజాగా కిమ్ అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ఆదివారం తెలిపింది. ఈ అధికారిక కార్యక్రమంలో కిమ్‌ మరోసారి తన రెండో కుమార్తెతో కనిపించారు.
‘దేశంతోపాటు పౌరుల గౌరవం, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకే అణ్వాయుధాలను నిర్మిస్తున్నాం.. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం’ అని కిమ్ ప్రకటించారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్‌-17 (ఐసీబీఎం)ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యూహాత్మక అణ్వాయుధంగా ఆయన అభివర్ణించారు. పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మించగల తమ సంకల్పం, సామర్థ్యాన్ని ఇది చాటుతుందని పేర్కొన్నారు. అలాగే, బాలిస్టిక్ క్షిపణులపై అణు వార్‌హెడ్‌లను అమర్చే టెక్నాలజీ అభివృద్ధిలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు అద్భుతమైన ప్రగతి సాధించారని ప్రశంసించారు.

కాగా, ఉత్తర కొరియా ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులతో పాటు పదుల సంఖ్యలో దీర్ఘ, మధ్యశ్రేణి క్షిపణులను పరీక్షించింది. కొరియా ద్వీపకల్పం చుట్టూ అమెరికా, దక్షిణ కొరియా చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత శుక్రవారం దాదాపు 15 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లగలిగే ఈ క్షిపణికి.. అమెరికాలోని ప్రధాన భూభాగాలను కూడా నాశనం చేయగల సామర్ధ్యం ఉంది.

ఉత్తర కొరియాను తిరుగులేని అణురాజ్యంగా సెప్టెంబరులో కిమ్‌ ప్రకటించారు. ఆ తర్వాత అమెరికా ప్రాంతీయ భద్రతా సహకారాన్ని అనూహ్యంగా పెంచింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో కలిసి ‘‘ విజిలెంట్‌ స్టోమ్‌’’ పేరుతో ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపడుతోంది.

అయితే, ఉత్తర కొరియా గతిశీల క్షిపణులను, అణ్వాయుధాలను పరీక్షించటానికి వీల్లేదని ఐక్యరాజ్యసమితి కొన్నేళ్ల కిందటే నిషేధించింది. గతంలో నిర్వహించిన ఇలాంటి పరీక్షలకు స్పందనగా ఆ దేశం మీద కఠిన ఆంక్షలు విధించింది.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.