యాప్నగరం

బ్రిటన్ రాణి అంత్యక్రియలు: 30 ఏళ్ల కిందే తయారైన శవపేటిక.. ఈ విషయాలు తెలుసా?

London: బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II అంత్యక్రియలు రాజకుటుంబం సాంప్రదాయాల్లో కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. లక్షలాది మంది బ్రిటన్‌ పౌరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా దేశ విదేశాల నుంచి సుమారు 2 వేల మంది అతిథులు హాజరయ్యారు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ సంప్రదాయాలు మొదలుకొని అంత్యక్రియల్లో ఉపయోగిస్తున్న శవపేటిక వరకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వివరాలు..

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 21 Sep 2022, 11:34 am
బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్‌-2 (Queen Elizabeth II) అంత్యక్రియలు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. లక్షలాది మంది బ్రిటన్‌ పౌరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు దేశ విదేశాల నుంచి సుమారు 2 వేల మంది అతిథులు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌లోని క్యాటఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను విండ్సర్‌ క్యాసిల్‌కు లాంఛనంగా తరలించారు. అంతకుముందు ఆమె పార్థివ దేహాన్ని వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు.
Samayam Telugu Queen Elizabeth II
క్వీన్ ఎలిజబెత్


✦ అంత్యక్రియలు జరుగుతోన్న వెస్ట్‌మిన్‌స్టర్ అబే చర్చిలోనే బ్రిటన్ రాజు/ రాణి పట్టాభిషేకం జరుగుతుంది.

✦ 1947లో క్వీన్ ఎలిజబెత్‌, ఫిలిప్‌ వివాహం కూడా ఇదే చర్చిలో జరిగింది.

✦ వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేలో ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడున్న గంటను 96 సార్లు మోగించారు. క్వీన్ ఎలిజబెత్‌ జీవించి ఉన్న 96 ఏళ్లకు గుర్తుగా ఇలా చేశారు.

✦ రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజ్‌లో రాణి పార్థివ దేహాన్ని తరలించారు. చివరిసారిగా ఈ క్యారేజ్‌ను 1979లో లార్డ్ మౌంట్‌బాటెన్ అంత్యక్రియల్లో ఉపయోగించారు.

✦ కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిసారిగా 60 ఏళ్ల కిందట విన్‌స్టన్‌ చర్చిల్‌కు జరిపారు.

✦ అంత్యక్రియలో ఉపయోగిస్తున్న శవపేటికకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంగ్లిష్‌ ఓక్‌ కలప, సీసపు పూత కలిగిన ఈ శవపేటికను 30 ఏళ్ల కిందటే తయారు చేశారు.

రాణి శవపేటిక


✦ రాయల్ ఫ్యామిలీ సంప్రదాయం ప్రకారం, రాజకుటుంబానికి చెందిన సాంద్రింగమ్‌ ఎస్టేట్‌లోని ఇంగ్లిష్‌ ఓక్‌ వృక్షం కలపతో శవపేటికను తయారు చేస్తారు.

✦ శవపేటికల్లో సీసపు పూతను ఉపయోగించే ఆనవాయితీ వందల ఏళ్ల కిందటి నుంచే ఉంది. సీసాన్ని ఉపయోగించడం వల్ల పేటిక మొత్తం సీల్‌ వేసినట్లు ఉంటుంది. బయట వాతావరణంలో ఉండే తేమ నుంచి రక్షణ కలుగుతుంది. దీంతో మృతదేహం ఆలస్యంగా కుళ్లిపోతుంది. ఏడాది సమయం పడుతుందని అంచనా.

✦ సీసానికి విచ్ఛిన్నమయ్యే తత్వం ఉండదు. ఈ కారణంగా శవపేటికలోనికి గాలి చొరబడే అవకాశం ఉండదు. దీంతో పేటిక నుంచి వాసన, ఇతర వాయువులు బయటకు వెళ్లలేవు.

✦ రాణి కిరీటం, రాజదండాన్ని ఈ శవపేటికతో పాటు తీసుకెళ్లారు. బ్రిటన్ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జెండాను శవపేటికపై కప్పి ఉంచారు.

✦ సాధారణ శవపేటికను ఆరుగురు మోస్తారు. కానీ, రాణి కోసం ఏర్పాటుచేసిన ఈ పేటికను మోయాలంటే 8 మంది సైనిక సిబ్బంది అవసరం.




Also Read: లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో పొడిచి చంపిన కేసులో సంచలనం
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.