యాప్నగరం

శ్రీలంకలో ప్రజాగ్రహం.. నేతల ఇళ్లకు నిప్పు.. ఎంపీతో సహా ఐదుగురు మృతి

శ్రీలంకలో నిరసనలు అదుపు తప్పాయి. గత కొంతకాలంగా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. సోమవారం నిరసనకారులు రెచ్చిపోయారు. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఎంపీల ఇళ్లకు, వాహనాలను నిప్పంటించారు. దాంతో ఓ ఎంపీ, అతని సెక్యూరిటీ అధికారి మృతి చెందారు. దీంతో స్థానిక భద్రతా సిబ్బంది నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో చాలామంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. బలగాలు మోహరించాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 10 May 2022, 12:40 pm

ప్రధానాంశాలు:

  • శ్రీలంకలో అదుపు తప్పిన ఆందోళనలు
  • ఎంపీల ఇళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు
  • దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu శ్రీలంక
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారింది. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. పలువురి ఎంపీల ఇళ్లకి, వాహనాలకు నిప్పంటించారు. సోమవారం ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. దాంతో ఆయన మద్దతుదారులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై దాడి చేశారు. ఈ పరిణామంతో శ్రీలంకలో హింస చెలరేగింది.


ఆగ్రహానికి గురైన నిరసనకారులు అధికార పార్టీ ఎంపీ సనత్ నిశాంత ఇంటికి నిప్పు పెట్టగా.. ఆయన ఇల్లు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అలాగే గాలెలోని మంత్రి రమేష్ పతిరాన, మౌంట్ లావినియాలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో ఇళ్లతో పాటు శ్రీలంక పొదుజన పెరమున రాజకీయ నాయకుల నివాసాలకు, వాహనాలకు కూడా దహనం చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీతో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.


అయితే ఆందోళనకారులను అడ్డుకోవడానికి స్థానిక సెక్యూరిటీ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. దాంతో 150 మందికిపైగా గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. రాజధానిలో సైనిక దళాలను మోహరించారు. కాగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు సాగుతున్నాయి. పాలకులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు పంపారు. ఆల్‌పార్టీ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని మహింద తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.