యాప్నగరం

లంక రాజకీయ దుమారం: వెనక్కి తగ్గిన సిరిసేన!

విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించి, రాజపక్సేను ఆ కుర్చీలో కూర్చోబెట్టిన లంక అధ్యక్షుడు.. సభ్యుల ‘మద్దతు కూడగట్టేందుకు’ రాజపక్సేకు అవకాశం ఇచ్చేలా పార్లమెంట్‌ను గతంలో సస్పెండ్ చేశారు. తాజాగా సస్పెన్షన్‌ను తొలగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 1 Nov 2018, 12:05 pm
పార్లమెంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తూ.. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన గురువారం నిర్ణయం తీసుకున్నారు. విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన సిరిసేన.. శ్రీలంక పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విక్రమసింఘే స్థానంలో రాజపక్సేను ప్రధానిగా నియమిస్తూ.. సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రాణిల్ విక్రమసింఘే ఆరోపించారు. ఇప్పటికీ తానే ప్రధానినని వాదించారు.
Samayam Telugu sirisena


బలనిరూపణకు వీలుగా పార్లమెంట్‌ను వెంటనే సమావేశపర్చాలని విక్రమసింఘే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. సభ్యులను కొనుగోలు చేయడం కోసం రాజపక్సేకు ఉపయోగపడేలా అధ్యక్షుడి నిర్ణయం ఉందని విక్రమసింఘే ఆరోపించారు. తాను విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో లంక రాజకీయం సందిగ్ధంలో పడింది.

పార్లమెంట్‌లో మొత్తం 225 స్థానాలు ఉండగా, విక్రమసింఘే పార్టీకి 113 మంది సభ్యుల బలం ఉంది. మరో ఏడుగురు మద్దతు పలికితే ఆయన సాధారణ మెజార్టీ సాధిస్తారు. స్పీకర్ కరు జయసూర్యతో చర్చించాక పార్లమెంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్టు సిరిసేన ప్రకటించారు. అధ్యక్షుడి నిర్ణయంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.