యాప్నగరం

Afghanistan తాలిబన్లకు భారీ షాక్: కీలక నేత రహీముల్లా హక్కానీ హత్య.. ఇంటిలోకి చొరబడి ఆత్మాహుతి దాడి

గతేడాది ఆగస్టులో అమెరికా సైన్యాలు వైదొలగడంతో మరోసారి ఆఫ్గన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. రెండు దశాబ్దాల పాటు నాటో బలగాల నీడన స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అఫ్గన్లు.. మళ్లీ నరకంలోకి జారుకున్నారు. అధికారం చేపట్టిన తొలి నాళ్లలో అందర్నీ క్షమించేశామని ఎటువంటి ఆంక్షలు, ప్రతీకారాలు ఉండవని ప్రకటించిన తాలిబన్లు.. అంతలోనే మాట మార్చారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినా దాడులు ఆగడం లేదు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 11 Aug 2022, 7:02 pm

ప్రధానాంశాలు:

  • గతేడాది ఆగస్టులో అధికారం చేపట్టిన తాలిబన్లు.
  • రెండు దశాబ్దాల తర్వాత అఫ్గన్ వీడిన అమెరికా.
  • మదర్సాలోకి వెళ్లి ఆగంతకుడు ఆత్మాహుతి దాడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తాలిబన్ నేత హక్కానీ
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లకు (Taliban) ఊహించని షాక్ తగిలింది. తాలిబన్ కీలక నేత షైక్ రహీముల్లా హాక్కానీ (Sheikh Rahimullah Haqqani) దారుణ హత్యకు గురయ్యారు. కాబూల్‌లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు ఆత్మాహుతి దాడికి (Kabul Suicide Attack) తెగబడ్డాడు. ఈ దాడిలో రహీముల్లా హక్కానీ మృతిచెందాడు. హక్కానీ మృతిని కాబూల్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ రహ్మాన్ (Abdul Rahman) ధ్రువీకరించారు. ఆయన మదర్సా వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోయారని తెలిపారు. అఫ్గన్‌లో తాలిబన్లు రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.
తాలిబన్ వర్గాలు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. రాజధాని కాబూల్‌లో మతపరమైన సమావేశంలో గతంలో కాలు కోల్పోయిన వ్యక్తి ప్లాస్టిక్ కృత్రిమ కాలులో దాచిన పేలుడు పదార్థాలను ఉంచి హక్కానీ ఇంటిలోకి చొరబడి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడు వెనుక ఎవరున్నారో వెంటనే తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

తాలిబన్ ప్రభుత్వ డిప్యూటీ అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ (Bilal Karimi) సైతం రహిముల్లా హక్కానీ మృతిని ధ్రువీకరించారు. ‘‘దేశంలోని గొప్ప విద్యావేత్త షేక్ రహీముల్లా హక్కానీ శత్రువుల క్రూరమైన దాడిలో అమరవీరుడు కావడం చాలా బాధాకరం’’ అని కరీమీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 2020 అక్టోబరులో హక్కానీ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి నుంచి తప్పించుకున్నారు.

హక్కానీ ‘హదీత్ సాహిత్యం’లో పండితుడిగా చెబుతారు. పాక్‌లోని స్వాబీ, అకోరా ఖట్టక్‌లోని దేవ్‌బందీ మదర్సాలలో మత విద్యను అభ్యసించాడు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ మిలటరీ కమిషన్ సభ్యునిగా హక్కానీని ప్రకటించిన వెంటనే అఫ్గన్‌లోని అమెరికా బలగాలు అతడితో పాటు చాలా మంది అరెస్ట్ చేసి బాగ్రామ్ జైలులో బంధించాయి.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.