యాప్నగరం

క్యాబ్ డ్రైవర్లూ.. హెల్మెట్ పెట్టుకోవడం మరవకండి!

వాహనదారులారా.. అందరూ హెల్మెట్ పెట్టుకొనే డ్రైవింగ్ చేయండి. ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి..

TNN 25 May 2017, 1:27 pm
వాహనదారులారా.. అందరూ హెల్మెట్ పెట్టుకొనే డ్రైవింగ్ చేయండి. ఆ..! ఇదేదో పాత చింతకాయ పచ్చడేగా.. మళ్లీ కొత్తగా చెబుతారెందుకూ.. అంటారా? అలా తీసిపారేయకండి.. ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి. అన్నట్టూ.. ఇక్కడ అందరూ అంటే.. కార్ నడిపేవాళ్లు, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు అన్నమాట. ఆహా..! పైత్యం బాగా ముదిరింది అంటారా.. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఉదంతం గురించి తెలుసుకున్న తర్వాత ఎవరికి ముదిరిందో మీరే చెప్పండి.
Samayam Telugu a car driver got challan for not wearing helmet in hyderabad
క్యాబ్ డ్రైవర్లూ.. హెల్మెట్ పెట్టుకోవడం మరవకండి!


కార్ డ్రైవర్ విష్ణు రోజూలానే.. ఓ పిక్-అప్ కాల్ రావడంతో క్యాబ్ తీసుకొని బయలుదేరాడు. ఇంతలో ఓ చోట ట్రాఫిక్ పోలీసులు అతణ్ని అడ్డుకొని, కార్ పక్కన నిలపాల్సిందిగా సూచించారు. అతడి దగ్గర డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేశాక.. ఈ క్యాబ్ నంబర్‌పై ఓ చలాన్ పెండింగ్‌లో ఉంది తెలుసా అని వాళ్లు ప్రశ్నించారు. అతడు తెలీదని సమాధానమిచ్చాడు. దీనిపై రూ. 100 చలాన్ పెండింగ్‌లో ఉంది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల జరిమానా పడింది అని పోలీసులు చెప్పారు.

వంద రూపాయలేగా కట్టేస్తే పోలా.. అనుకొని, విష్టు జేబులు తడుముకోవడం ప్రారంభించాడు. కాసేపయ్యాక గానీ, మనోడికి అసలు విషయం అర్థం కాలేదు. వెంటనే అతడు.. కార్ డ్రైవింగ్ చేస్తే కూడా హెల్మెట్ పెట్టుకోవాలా? అంటూ పోలీసులను అమాయకంగా ప్రశ్నించాడు. వాళ్లు నెత్తి గోక్కుంటూ.. ‘ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది, పరిశీలించి చెబుతాం’ అని చెప్పి, అతణ్ని అక్కడ నుంచి పంపించేశారు.

సదరు చలాన్‌కు సంబంధించి ఆ క్యాబ్ ఓనర్‌కు సోమాజిగూడ ట్రాఫిక్ విభాగం నుంచి అప్పటికే ఓ నోటీసు కూడా వెళ్లిందట. ‘TS09ES4716 అనే నంబర్ గల క్యాబ్‌ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల రూ. 100 జరిమానా విధిస్తూ చలాన్ జారీ చేశాం. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని సదరు నోటీస్ సారాంశం.

‘ఇది మా సిబ్బంది పొరపాటే. ట్రాఫిక్ పోలీసులు తమ ట్యాబ్‌ ద్వారా చలాన్ వివరాలు ఎంటర్ చేసే సందర్భాల్లో.. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు చోటు చేసుకుంటాయి’ అని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. దీనిపై ‘దెక్కన్ క్రానికల్’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా.. టూ వీలర్‌పై ప్రయాణించే వాళ్లు మాత్రం.. హెల్మెట్ పెట్టుకోవడం అస్సలు మరచిపోకండి.. ప్లీజ్..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.