యాప్నగరం

బుల్లితెర హాస్య నటుడు.. వ్యసనాలకు బానిసై చోరీలు

అతడో సినీ స్టూడియోలో పని చేస్తూ.. బుల్లితెరపై అవకాశం సొంతం చేసుకున్నాడు. ఓ కామెడీ షోలో హాస్యనటుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో జల్సాలకు బానిసయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Samayam Telugu 1 May 2018, 12:55 pm
అతడు డిగ్రీ మధ్యలో మానేసి కార్మికుడిగా పని చేశాడు. పెళ్లి చేసుకొని ఉపాధి కోసం నగర బాట పట్టాడు. ఓ సినీ స్టూడియోలో పని చేస్తూ.. క్రమంగా బుల్లితెరపై అవకాశం సొంతం చేసుకున్నాడు. ఓ కామెడీ షోలో హాస్యనటుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో జల్సాలకు బానిసయ్యాడు. కట్ చేస్తే.. దొంగగా మారి పోలీసులకు చిక్కాడు. చైతన్యపురి, సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండేళ్లుగా డజనుకు పైగా చోరీలు చేస్తూ కళ్లుగప్పి తిరుగుతున్న దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Samayam Telugu nagaraju


రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన బి నాగరాజు (23) అలియాస్‌ నరేందర్‌ అలియాస్‌ గుంటూరు నరేంద్ర డిగ్రీ మధ్యలో మానేసి స్థానికంగా సెంట్రింగ్‌ కార్మికుడిగా పని చేశాడు. పెళ్లి చేసుకుని ఉపాధి వెతుక్కుంటూ 2016లో నగరానికి వచ్చాడు. సినీ రంగంపై ఆసక్తితో కొంత కాలంపాటు సినీ స్టూడియోల్లో ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేశాడు. ఇదే క్రమంలో ఓ టీవీ షోలో హాస్యనటుడిగా అవకాశం దక్కించుకున్నాడు.

నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో నాగరాజు జీవితం గాడితప్పింది. క్రమంగా మద్యం, పొగతాగడానికి అలవాటుపడ్డ నాగరాజు.. అందుకు డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడ్డాడు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో రెండేళ్లలో 16 దొంగతనాలు చేశాడు. చైతన్యపురి పోలీసులు అతణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

2014-15లోనే హుజూర్‌నగర్‌లో నాగరాజు నాలుగు బైకులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు బానిసై డబ్బులు సరిపోక మళ్లీ అతడు పాత ప్రవృత్తిలోకి దిగినట్లు తెలిపారు. నాగరాజు నుంచి రూ.14,52,500 విలువైన 72 తులాల బంగారం, 310 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎవరికీ అనుమానం రాకుండా నాగరాజు తాను దొంగలించిన నగలను ప్రముఖ గోల్డ్‌ లోన్‌ సంస్థలలోని వివిధ శాఖల్లో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నాడు. కొన్ని ఆభరణాలను వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనర్ అతడిపై పీడీ చట్టం ప్రయోగించి అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.