యాప్నగరం

ఎమ్మెల్యే కిడారి, సోమ హత్యకు నిఘా వైఫల్యమే కారణం.. కన్నా

పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ నాయకులు చనిపోయారని వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ఈ హత్యలకు నిఘా వర్గాల వైఫల్యమే కారణంటూ విపక్ష నేత కన్నా వ్యాఖ్యానించారు.

Samayam Telugu 24 Sep 2018, 1:15 pm
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలకు నిఘా వైఫల్యమే కారణమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. సోమవారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణ ఎన్నికలకు వినియోగించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పోలీస్, నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయాయని కన్నా విమర్శించారు. పోలీసులు ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. హత్యలతో సమస్యల పరిష్కారం కావని, ప్రాణాలు తీయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని నక్సల్స్ గుర్తించాలని కన్నా సూచించారు.
Samayam Telugu కన్నా లక్ష్మీనారాయణ


ఏడాదిన్నర నుంచి చంద్రబాబు, రాహుల్ స్నేహం చేస్తున్నారని, గాలి వార్తలతో ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ మండిపడ్డారు. రక్షణవ్యవస్ధ మెరుగుపడకూడదని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, రఫెల్ విషయంలో దేశానికి, ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ గురించి లాలూ, చంద్రబాబు లాంటి అవినీతిపరుల విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వ హాయాంలో జరిగిన కుంభకోణాలను మోదీకి అంటగట్టాలని చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.