యాప్నగరం

అఖిలపక్షం ఏర్పాటు చేసిన బాబు.. వైసీపీ, జనసేన డుమ్మా!

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీఏ నుంచి ఇప్పటికే బయటకు వచ్చి, పార్లమెంటులో పోరాటం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చింది.

Samayam Telugu 27 Mar 2018, 8:06 am
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీఏ నుంచి ఇప్పటికే బయటకు వచ్చి, పార్లమెంటులో పోరాటం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు తదితర అంశాలను అఖిలపక్షంలో చర్చించునున్నారు.
Samayam Telugu ఏపీ సీఎం చంద్రబాబు


రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించడానికి ఈ భేటీకి రాజకీయ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులను సైతం ఆహ్వానించారు. ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో మంగళవారం చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు అఖిలపక్ష సమావేశానికి హాజరు కారాదని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నిర్ణయించింది. ప్రత్యేక హోదా సాధించకపోవడానికి చంద్రబాబే కారణమని ఆ పార్టీ ఆరోపించింది. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత అఖిలపక్షం సమావేశం నిర్వహించడమేంటి, చంద్రబాబుతో మేము పాఠాలు చెప్పించుకోవాలా? అంటూ వైసీపీ మండిపడింది. కాబట్టి ఈ సమావేశానికి తాము హాజరు కావడం లేదని వైసీపీ నేత బొత్స సత్యన్నారాయణ ప్రకటించారు.

అలాగే జనసేన సైతం సమావేశానికి వెళ్లరాదని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అఖిలపక్షం నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇదో కంటితుడుపు చర్యగా ఆ పార్టీ అభివర్ణించింది. కాంగ్రెస్, సీపీఎంలు ఈ సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించాయి. బీజేపీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఆ పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది. ఏపీకి జరిగిన అన్యాయంపై అందరు వేళ్లు తమవైపు చూపడంతో ఏం చేయాలనే సమాలోచనలో బీజేపీ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.