యాప్నగరం

‘నేరస్థుడు ఎలా ఉండాలో జగన్‌కు తెలుసు.. అన్నగా ఎలా ఉండాలో తెలుసా?’

అన్న వస్తున్నాడంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారం గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు, నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని విమర్శించారు.

Samayam Telugu 12 Feb 2019, 6:18 pm
అధికారంలోకి వస్తే వితంతు, వృద్ధాప్య ఫించన్లు రూ.3 వేలు ఇస్తామని తిరుపతిలో బుధవారం జరిగిన వైసీపీ సమర శంఖారావంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గురువారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ... వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఓ సిద్ధాంతం అనేదే లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్‌కు దిక్కుతోచడం లేదని, వృద్ధాప్య పింఛను రూ.2 వేలు అందజేస్తుంటే, తాను రూ.3వేలు ఇస్తానని జగన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. ఫిబ్రవరి 11న ఢిల్లీ వేదికగా పెద్దఎత్తున ధర్మపోరాట దీక్షను తలపెట్టామని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి దీనికి భారీగా మద్దతు పలకాలని సూచించారు.
Samayam Telugu AP_CM


అలాగే ఈ నెల10న ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. సమష్టి కృషితో ఎన్నో విజయాలను అందుకున్నామని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 80 శాతం ఓటు బ్యాంకు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఎన్నో ఏళ్ల బందరు పోర్టు కల నేడు సాకారం కాబోతుందని సీఎం వివరించారు.

అన్న వస్తున్నాడంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారం గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు, నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని విమర్శించారు. నేరస్థుడు ఎలా ఉండాలో తెలుసు గానీ.. అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్ఐలకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారని, ఆ పార్టీ నేతలు ఈ తరహా ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతారని, అంతటా అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే సదుద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని హామీలు గుప్పించినా ఇబ్బందేం లేదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లాలని వివరించారు. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీతోనే ఆగిపోకుండా, వాటిని బ్యాంకుల్లో వేసి డబ్బులు ఇప్పించే బాధ్యతనూ కూడా టీడీపీ నేతలు తీసుకోవాలని బాబు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.