యాప్నగరం

ప్యాకేజీతో 5 కోట్ల మందికి భవిష్యత్తు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించడం రాష్ట్రానికి ఎంతో మేలని, దీంతో ఏపీలోని ఐదు కోట్ల మంది భవిష్యత్తు ముడిపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

TNN 16 Mar 2017, 4:03 pm
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించడం రాష్ట్రానికి ఎంతో మేలని, దీంతో ఏపీలోని ఐదు కోట్ల మంది భవిష్యత్తు ముడిపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదంపై గురువారం ఆయన శాసనసభలో ప్రకటన విడుదల చేశారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదాను తీసేశారని, అందుకనే హోదాతో వచ్చే వాటిని ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని కేంద్ర హామీ ఇచ్చిందని సీఎం వివరించారు. పోలవరం ఎలా పూర్తిచేస్తారన్న విషయాన్ని చట్టంలో పెట్టలేదని, అయితే ఈ ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత తెదేపా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ తమ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిచేస్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో విపక్షాలకు చిత్తశుద్ధి లేదని చంద్రబాబు విమర్శించారు. పోలవరానికి రెండున్నరేళ్లలో రూ. 3,541 కోట్లు ఖర్చుచేశామని, ఆ ఏడు ముంపు మండలాలు ఏపీకి రాకుంటే పోలవరం ముందుకు కదిలేది కాదని వివరించారు.
Samayam Telugu ap cm chandrababu naidu statement in assembly on special package approval
ప్యాకేజీతో 5 కోట్ల మందికి భవిష్యత్తు: చంద్రబాబు


పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, 2018 నాటికి గ్రావిటీతో నీళ్లు పారించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తాన్నామని చెప్పారు. ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అడ్డంగా మాట్లాడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీని ఆదుకుంటామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందని చెప్పారు. వైకాపా సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ.. సభ్యతలేని వ్యక్తులతోనూ సభ్యతగా ఉండాలని తమ సభ్యులకు సూచించానని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి విశాఖపట్నానికే రైల్వేజోన్ రావాలని, దీన్ని త్వరలో సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజవర్గాల పెంపు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సభ్యుల సంఖ్య 225కి పెరిగితే సభ నిండుగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్యాకేజీకి చట్టబద్ధత, పోలవరానికి 100 శాతం నిధులపై హర్షం వ్యక్తం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం మరింత సాయం చేయాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.