యాప్నగరం

పవన్ ఇంత డ్యామేజ్ చేస్తాడనుకోలేదు: చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు చర్చ జరిగేలా లోక్‌సభలో పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

Samayam Telugu 20 Mar 2018, 11:16 am
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు చర్చ జరిగేలా లోక్‌సభలో పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఎంపీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అవసరమైతే తమకు మద్దతు తెలుపుతున్న ఇతర పార్టీలతోనూ నోటీసులు ఇప్పించాలని చంద్రబాబు సూచించారు. సోమవారం మాదిరిగానే ఇతర పార్టీల ఎంపీలతో వెల్‌లో గొడవ చేయించి సభను వాయిదా వేసే అవకాశం ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.
Samayam Telugu AP_CM


‘మనపై పవన్ కళ్యాణ్ అవాకులు చవాకులు పేలుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నారు. పవన్ మనల్ని ఇంత డ్యామేజ్ చేస్తాడనుకోలేదు’ అని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. డబ్బుల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామనడం సరికాదని.. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల మన ఖ్యాతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని సీఎం ఎంపీలకు వెల్లడించారు. బీజేపీకి కోవర్టులుగా జగన్, పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఏం చెబితే పవన్ అదిచేస్తున్నారని, పవన్ బాగా తిట్టాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబూ కూడా అంటున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే, బీజేపీ చేతిలో పావుగా మారిన పవన్ తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

అవిశ్వాసంపై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని ఎంపీలకు సీఎం సూచించారు. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని మద్దతు అడగొద్దని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామన్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్సే స్వతంత్రంగా మనకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలని ఎంపీలకు చంద్రబాబు వివరించారు. ‘ఉదయం 11 గంటలకు మన ఎంపీలు ఎవరూ వెల్‌లోకి వెళ్లొద్దు’ అని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.