యాప్నగరం

విజయసాయికి కీలక పదవిని కట్టబెట్టిన జగన్.. ఢిల్లీలో ఏపీకి పెద్ద దిక్కు ఆయనే!

వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డికి ఏపీ సర్కారు కీలక పదవిని కట్టబెట్టింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 22 Jun 2019, 7:30 pm
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమిస్తూ ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆయన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధాన కర్తలా వ్యవహరించనున్నారు.
Samayam Telugu vijayasai reddy


వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ ఎవరి మాట విన్నా వినకున్నా విజయసాయి మాట మాత్రం కచ్చితంగా వింటారని వైఎస్ఆర్సీపీ నేతలే చెబుతుంటారు. సీఏ చేసిన ఆయనకు ఆర్థికాంశాల పట్ల మంచి పట్టుంది. బీజేపీ, వైఎస్ఆర్సీపీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి హాయ్ విజయ్ గారూ అని సంబోధించిన సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా చంద్రబాబును, టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల వేళ జగన్ తర్వాత పార్టీలో అంతా తానై వ్యవహరించారు. సీనియర్ నేతలను కాదని మరీ జగన్ విజయసాయిని రాజ్యసభకు పంపారు. రాజ్యసభకు వెళ్లగానే ఆయన ఢిల్లీలో పార్టీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. బీజేపీకి టీడీపీ దూరమయ్యేలా ఆయన మైండ్ గేమ్ ఆడారు. టీడీపీ ఎన్డీయేలో భాగంగా ఉన్నప్పటికీ.. విజయసాయి అనేకసార్లు ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ విజయసాయికి ప్రధాన్యం ఇవ్వడం టీడీపీకి ఇబ్బందిని కలిగించింది. 2014 ఎన్నిక‌ల్లో ఓటమి తర్వాత ప్రశాంత్ కిశోర్‌ సేవలను ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది విజయసాయేనని టాక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.