యాప్నగరం

ఉమ్మడి రాష్ట్ర సమాచార ‘హక్కు’కు తాళం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు పూర్తిగా నిలిచిపోయింది.

Samayam Telugu 17 May 2017, 3:15 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు పూర్తిగా నిలిచిపోయింది. అప్పీళ్లు, ఫిర్యాదుల విచారణ ఆగిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా సమాచార హక్కు చట్టం ‘ఏపీ సమాచార కమిషన్‌’ పేరిటనే కొనసాగింది. దీని ప్రధాన కార్యాయలం హైదరాబాద్ నాంపల్లిలో ఉంది. కమిషన్‌లో మిగిలిన ఒకే ఒక్క సమాచార కమిషనర్‌ విజయబాబు ఈ నెల 15న పదవీ విరమణ చేయడంతో మంగళవారం నుంచి కమిషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
Samayam Telugu ap information commission closed due to scarcity of commissioners and members
ఉమ్మడి రాష్ట్ర సమాచార ‘హక్కు’కు తాళం!


రెండు రాష్ట్రాలకు చైర్మన్ తో పాటు 20 మంది కమిషనర్లు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం కనీసం ఒక్కరు కూడా లేరు. రాష్ట్ర విభజన అనంతరం దీన్ని పూర్తిస్థాయిలో విభజించలేదు.

ఇప్పటి దాకా రెండు రాష్ట్రాల ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు సమాచార హక్కు కమిషన్ లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. 35 మందిదాకా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. వీరికి రెండు రాష్ట్రప్రభుత్వాలు వేతనాలు భరించాయి. వీరిలో ఏపీకి చెందినవారిని వెంటనే వారి సొంత శాఖల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీతాలిచ్చుకోలేమంటూ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.

కొంతమంది నెలకు రూ.50వేల దాకా గౌరవ వేతనం పొందుతూ ఖాళీగా కూర్చుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నియమితులైన నలుగురు కమిషనర్ల నియామకం చెల్లదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజకీయ పార్టీల నేతలను కమిషన్ సభ్యులుగా చేశారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మిగిలినవారు ఒక్కొక్కరు పదవీ విరమణ చేశారు.

సమాచార హక్కు చట్టం అమలయ్యే.. కమిషన్ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని చివరి కమిషనర్ విజయబాబు గవర్నర్ నరసింహాన్ కలిసి కోరారు. కమిషన్ ను తాత్కాలికంగా మూసివేయడం తగదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.