యాప్నగరం

‘రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారంతా ఒక్కటే’

రాష్ట్రాలుగా విడిపోయినా.. ప్రపంచం దృష్టిలో తెలుగువారంతా ఒక్కటేనని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 21) రాజ్‌భవన్‌లో ఆయనకు ఘనంగా పౌరసన్మానం..

TNN 21 Aug 2017, 1:54 pm
రాష్ట్రాలుగా విడిపోయినా.. ప్రపంచం దృష్టిలో తెలుగువారంతా ఒక్కటేనని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 21) రాజ్‌భవన్‌లో ఆయనకు ఘనంగా పౌరసన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయింది ఎవరిపైనో కోపంతో కాదని, ఎవరి ప్రాంతాన్ని వారే పాలించుకుని అభివృద్ధి చెందాలన్న కాంక్షే రాష్ట్ర విభజనకు దారితీసిందని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు సహకరించుకుని అభివృద్ధిలో పోటీపడాలని ఆయన సూచించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.
Samayam Telugu bifurcated for development but telugu people are unite says venkaiah
‘రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారంతా ఒక్కటే’


‘సన్మానం తర్వాత విందు ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ చెప్పారు. కానీ ఆయన ప్రసంగం విన్నాక కడుపు నిండిపోయింది. తెలంగాణతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. నేను రాజకీయంగా ఎదిగిందీ.. ఒదిగిందీ తెలంగాణలోనే. తెలంగాణ నేల.. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. హైదరాబాద్‌ బిర్యానీ, హలీం ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ప్రపంచ అభివృద్ధి పటంలో హైదరాబాద్‌ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది’ అని వెంకయ్య పేర్కొన్నారు.

‘తెలుగుభాషలో గ్రామరే కాదు.. గ్లామర్‌ కూడా ఉంది. అంటువ్యాధిలా మారిన ఇంగ్లిష్‌ను వదిలించే బాధ్యతను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాలి. కన్నతల్లిని, మాతృభాషను, మాతృదేశాన్ని పట్టించుకోని వాడు మనిషే కాదు. ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు.. తెలుగు భాషాభిమానిని. రాజకీయంగా ఎదిగిన హైదరాబాద్‌ నుంచే నా అధికారిక పర్యటన ప్రారంభించాలనుకున్నా’ అని వెంకయ్య అన్నారు.

ప్రజలతో మమేకమై ఎదిగిన తనకు ఉప రాష్ట్రపతి ప్రొటోకాల్‌ కొత్తగా ఉందని, దానికి క్రమంగా అలవాటు పడుతున్నానని వెంకయ్య తెలిపారు. ఆకలి లేని, అవినీతి, అక్రమాలకు తావులేని దేశాన్ని మనం నిర్మించుకోవాల్సి ఉందని, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు మాట్లాడిన గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరపున వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం జరగడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. ‘వెంకయ్యను ఘనంగా సన్మానించుకోవడం తెలుగు వారందరికీ శుభ పరిణామం. ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ర్టపతిగా ఎన్నికవడం అందరూ అభినందించాల్సిన విషయం. దేశానికి వెంకయ్యనాయుడు సేవలు ఎంతో అవసరం. రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్య సమర్థంగా పని చేస్తారు’ అని గవర్నర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.