యాప్నగరం

టీడీపీ ప్రభుత్వానికి పురంధేశ్వరి హెచ్చరిక!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది.

TNN 6 Jan 2018, 12:52 pm
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం పాటించడం లేదంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ విమర్శలపై చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా, కొందరు నేతల మాత్రం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే బీజేపీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చంద్రబాబు తమ నేతలకు సూచించారు. దీంతో వివాదం కొంత సద్దుమణిగినట్లు కనిపించింది. తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంపై మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన విషయంలో తప్పులు చేస్తోన్న టీడీపీ... ఆ తప్పులను కేంద్రం నెట్టేస్తోందని ఆమె ఆరోపించారు.
Samayam Telugu bjp leader daggubati purandeswari fires on tdp government
టీడీపీ ప్రభుత్వానికి పురంధేశ్వరి హెచ్చరిక!


రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు 80 శాతం నిధులు కేంద్రమే మంజూరు చేస్తోందని, అయినా, రాష్ట్ర ప్రభుత్వం వీటిని అందించడం లేదని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. నిధుల కేటాయింపులకు సంబంధించి అనేక ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. మిత్రపక్షమైన టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ పోతే.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ సామర్థ్యాన్ని బట్టి బీజేపీ పోటీ చేస్తుందని ఆమె హెచ్చరించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డంకిగా మారాయని స్పష్టం చేశారు. గత డిసెంబరులోనూ పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలంటూ పురంధేశ్వరి ఆరోపించారు.

కేంద్రానికి సరైన లెక్కలు పంపకుండానే అవసరమైన నిధులు విడుదల చేయటం లేదని కేంద్రంపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. టిడిపి తమకు ప్రతిపక్షమా? మిత్రపక్షమా? అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపటం లేదన్నదే తమ పాయింటన్నారు. కేంద్రానికి సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ఈఏపీ ప్రాజెక్టు ద్వారా నిధులు ఇస్తోందని పురందరేశ్వరి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.