యాప్నగరం

పోలవరంపై మిత్రుల మధ్య మాటల యుద్ధం!

పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొంత భాగాన్ని కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలని భావిస్తోన్న ఏపీ సర్కార్‌కు అథారిటీ తేల్చేవరకు టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని కేంద్రం లేఖ రాయడంతో వివాదం రాజుకుంది.

TNN 1 Dec 2017, 2:52 pm
పోలవరం ప్రాజెక్టు విషయంలో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొంత భాగాన్ని కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలని భావిస్తోన్న ఏపీ సర్కార్‌కు అథారిటీ తేల్చేవరకు టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని కేంద్రం లేఖ రాయడంతో వివాదం రాజుకుంది. ఈ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీ మధ్య మాటల యుద్థం ఆరంభమైంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu bjp mlc somu veerraju shocking comments about tdp for polavaram project
పోలవరంపై మిత్రుల మధ్య మాటల యుద్ధం!


పోలవరాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తారన్న నమ్మకంతో చంద్రబాబు చేతుల్లో పెడితే, ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టించి, కేంద్రంపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం దగ్గర అసలు విషయాలను దాచి పెట్టి, కేవలం సాంకేతికపరమైన అంశాలతో లేఖను రాయడం తగదని, గుత్తేదారులను మార్చాలన్న ఆలోచన వెనుక దురుద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రం, సంబంధిత మంత్రులకు దృష్టికి తీసుకువెళ్తున్నామని, చంద్రబాబు వైఖరిపై కూడా వారు ఆగ్రహంతో ఉన్నారని వీర్రాజు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనే నిర్వాసితుల సమస్య కూడా రావడంతో భారం పెరుగుతోందన్న విషయం తమకూ తెలుసని, ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తాము సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తమపై విమర్శలు గుప్పిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో వక్రీకరించి బీజేపీపై విమర్శలు చేయిస్తుండటం బాధను కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే, అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా ఎవరినీ బయటపెట్టకుండా టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం సంకల్పంతో ఉన్నా, కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి కాంట్రాక్టులను ఆపాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, టీడీపీ సర్కారు పలువురు అధికారులను పావులుగా మారుస్తోందని రఘునాథబాబు విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.