యాప్నగరం

పశ్చిమ బంగా వ్యవహారం ఫెడరల్ ఫ్రంట్‌ కిందికి రాదా కేసీఆర్?: విజయశాంతి

ఎన్నికల సమీపిస్తోన్న వేళ పశ్చిమ్ బెంగాల్ అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం, ఈ విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

Samayam Telugu 4 Feb 2019, 9:38 am
పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మోదీ సర్కారుపై ఒంటికాలిపై లేచే పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శారదా చిట్స్ కుంభకోణం కేసులో కోల్‌కతా కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆదివారం రావడంతో అపర కాళికలా మారిపోయారు. సీబీఐ దూకుడుపై మండిపడ్డ మమత పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ నివాసానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంఘీభావం తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం, మమత మధ్య మరింత అగ్గి రాజుకుంది. ఈ వ్యవహారంపై విపక్ష పార్టీలు మమతకు మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఎస్పీ అధినేత అఖిలేశ్, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ తదితర నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించాయి.
Samayam Telugu vijayashanthi


ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ఆయనపై ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పదేపదే ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతారు.. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.. మరి మమతా బెనర్జీ విషయంలో ఆయన నోరెత్తకపోవడం శోచనీయమని విజయశాంతి ధ్వజమెత్తారు. మోదీ సర్కారు సీబీఐని కీలుబొమ్మగా ఉపయోగించుకుంటూ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తోందని మమత పదే పదే చెబుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. మోదీ ఒంటెత్తు పోకడలపై పోరాటం చేస్తోన్న మమతకు ఎందుకు మద్దతివ్వడం లేదని కేసీఆర్‌ను విజయశాంతి నిలదీశారు.

పశ్చిమబెంగాల్‌లో ఇంత జరుగుతున్నా మమతకి మద్దతుగా, కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడకపోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో వ్యవస్థల దుర్వినియోగం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ కిందికి రాదా? అని విజయశాంతి సూటిగా ప్రశ్నించారు. లేదంటే కొన్ని విషయాలను చూసీ చూడనట్టు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమా? అని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.