యాప్నగరం

సీఈసీ నుంచి తెలంగాణ ఎన్నికల అధికారికి పిలుపు

తెలంగాణ శాసనసభ రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను హుటాహుటీన ఢిల్లీకి రావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Samayam Telugu 8 Sep 2018, 7:12 am
తెలంగాణ శాసనసభ రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను హుటాహుటీన ఢిల్లీకి రావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై రజత్‌ కుమార్‌తో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఉదయం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.
Samayam Telugu టీఎస్ ఎన్నికల అధికారి


సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఇకపై ఈవీఎంలకు తప్పనిసరిగా వీవీప్యాట్‌లను అమర్చాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించేందుకు దశలవారీగా శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమావేశమయ్యారు. అయితే, తెలంగాణ శాసనసభ రద్దు నేపథ్యంలో.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఒకవేళ కేంద్రం ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తే ముందస్తుకు సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.