యాప్నగరం

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. హత్య

విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు యువకులు పదో తరగతి బాలికను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు..

TNN 2 Sep 2017, 2:25 pm
విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు యువకులు పదో తరగతి బాలికను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. బొబ్బిలి మండలం రెడ్డివలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు తమ గ్రామ శివారుకు సమీపంలోని గాదెలవలస పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ బాలిక రోజూ మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికెళుతుంది. ఇది గమనించిన కొంత మంది యువకులు కొన్ని రోజులుగా ఆ బాలికను వేధిస్తున్నారు. ఇంట్లో చెబితే ఏమవుతుందో అనే భయంతో ఇందు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు శుక్రవారం (సెప్టెంబర్ 1) మధ్యాహ్నం ఈ కిరాతకానికి ఒడిగట్టారు.
Samayam Telugu class 10 girl brutally gang raped and killed by 4 men in vizianagaram
పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. హత్య


ఒంటరిగా ఇంటికెళుతున్న ఇందును మార్గమధ్యంలో అపహరించి సమీపంలోని టేకు తోటలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. చుట్టూరా దట్టమైన తోటలు, వ్యవసాయ పొలాలు ఉండటంతో ఆ బాలిక ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. అత్యాచారం విషయం ఊర్లో తెలిస్తే గొడవవుతుందని భావించిన కిరాతకులు ఆ బాలికను అత్యంత పాశవికంగా గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడేసి పరారయ్యారు.

తమ కూతురు మధ్యాహ్న భోజనానికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. స్పెషల్ క్లాసుల ఒత్తిడి ఏదైనా ఉండి కుదరలేదేమో అనుకొని మిన్నకుండిపోయారు. చివరికి చీకటి పడుతున్నా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. రాత్రి బాగా చీకటిపడేవరకు వెతికినా ఇందు ఆచూకీ దొరకలేదు.

శనివారం ఉదయం చెరువులో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఇందు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. జరిగిన ఘోరాన్ని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోవడం.. పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, సీఐ గోవిందరావు, సీతానగరం సీఐ సాయికృష్ణ.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కొంత మంది స్థానిక యువకులను ప్రశ్నించగా వచ్చిన సమాచారం మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ ఇందు సీనియర్లేనని ప్రాథమికంగా గుర్తించారు. వారిలో వివాహితుడైన ఒక యువకుడు ఇందుపై కన్నేసి రెండో పెళ్లి చేసుకుంటానని వేధించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.