యాప్నగరం

ప్రజాస్వామ్య యాత్రకు వడ‘దెబ్బ’.. ఆస్పత్రిలో చేరిన భట్టి

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క.. వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

Samayam Telugu 2 May 2019, 4:54 pm
కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క.. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. బుధవారం (మే 1) రాత్రి తీవ్ర జ్వరంతో ఆయన ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో భట్టి వెంట ఆయన సతీమణి ఉన్నారు.
Samayam Telugu Bhatti
భట్టి విక్రమార్క


తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతుండటాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గత మూడు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

వరస సభలు, సమావేశాలతో భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖండిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన అస్వస్థతకు గురవడం కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులను నిరాశకు గురిచేసింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.