యాప్నగరం

మరో 15ఏళ్లు కేసీఆరే సీఎం: కేటీఆర్

తెలంగాణ ప్రజలు తాము చేసిన అభివృద్ధిని చూసే ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదని ప్రజలే తీర్పు చెప్పారన్నారు.

Samayam Telugu 7 Dec 2022, 10:53 pm
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 10-15ఏళ్లు ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లేందుకే తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తనను సీఎంగా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఏర్పాటుచేసిన ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినా ఆయన హైదరాబాద్ నుంచే చక్రం తిప్పుతారని తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
Samayam Telugu ktrpressmeet


తెలంగాణ ప్రజలు తాము చేసిన అభివృద్ధిని చూసే ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదని ప్రజలే తీర్పు చెప్పారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 98 లక్షల ఓట్లు వచ్చాయని, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తమకు 42లక్షల ఓట్ల వ్యత్యాసం ఉందన్నారు. దీన్ని బట్టే ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే ప్రజా బలం అని చెప్పుకుంటున్న నేతలు.. తెలంగాణలో ఓడిపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ అయ్యాయని ఆరోపిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ప్రజబలం లేని ప్రజా కూటమిని భారీస్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఓ వర్గం మీడియా తీవ్రంగా ప్రయత్నించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ కూటమిదే విజయమని, టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని ప్రజలపై ముద్ర వేసేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించాయన్నారు. ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలం, కూల్చగలం అనుకుంటున్న మీడియా సంస్థలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు చేసిన ప్రచారంతో కొన్నిసార్లు తామే కన్ఫ్యూజన్ అయ్యామన్నారు. ఓ వ్యక్తి చేసిన సర్వేని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు విశ్లేషణలు చేయడం సమంజసమా? కాదా? అని వారే నిర్ణయించుకోవాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.