యాప్నగరం

గవర్నర్‌వా? టీఆర్ఎస్ ఏజెంట్‌వా?: టి. కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా, ఎఆర్పీఎస్ అధ్యక్షుడు మంద‌కృష్ణ‌ మాదిగ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌‌ను కలిశారు.

TNN 6 Jan 2018, 8:59 am
తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా, ఎఆర్పీఎస్ అధ్యక్షుడు మంద‌కృష్ణ‌ మాదిగ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌‌ను కలిశారు. దీని కోసం ఫిర్యాదు చేయడానికి రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు, గవర్నర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ నేతలు ఏకరవుపెట్టారు. దీనిపై గవర్నర్ స్పందించిన తీరుతో కాంగ్రెస్ నేతలు ఒకానొక సమయంలో సహనాన్ని కోల్పోగా, వారి మాటలకు నరసింహన్‌ కూడా సంయమనం కోల్పోయినట్టు భోగట్టా. ఇరువురి మధ్య సుమారు గంట పాటు వాడివేడిగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Samayam Telugu congress leaders meet governor esl narasimhan in hyderabad
గవర్నర్‌వా? టీఆర్ఎస్ ఏజెంట్‌వా?: టి. కాంగ్రెస్


కామారెడ్డి జిల్లాలో ఓ వీఆర్ఏను ఇసుక మాఫియా హత్య చేసిందని, వీరి ఆగడాలు మితమీరిపోయానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే గవర్నర్ జోక్యం చేసుకుని అతడు వీఆర్ఏ కాదని అన్నారు. అంతేకాదు అతడిని ట్రాక్టర్‌తో గుద్దించి చంపింది వాస్తవం కాదు.. రాజకీయ నాయకులకు అక్కడ పనేంటి? మీరు ఎందుకు వెళుతున్నారని ఎదురు ప్రశ్నించారు. అలాగే సీఎం, ఆయన కుమారుడిపై మీరు ఆరోపణలు చేయకూడదని అన్నారు. దీంతో ఉత్తమ్ ఒకింత అసహానానికి గురయ్యారు. రాజకీయ నాయకులను పోవద్దంటారేంటి... ప్రజా సమస్యలపై స్పందించడం మా విధి.. మేం ఎక్కడికైనా వెళ్తామని బదులిచ్చారు. అలాగే మేమేం చేయాలో మాకు మీరు చెప్పలేరు, మేం మాట్లాడితే మేం వినాలి అని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంలో మాజీ ఎంసీ సర్వే సత్యన్నారాయణ జోక్యం చేసుకోబోగా గవర్నర్ వారించారు.

దాంతో ఆగ్రహించిన సర్వే.. మేం పిల్లలం అనుకుంటున్నారా, మీ హోదాకు తగిన మాటలు కాదని వ్యాఖ్యానించారు. సీఎం, ఆయన కొడుకును ఎలా వెనుకేసుకొస్తారు... మీరు టీఆర్ఎస్ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. నన్ను అంత మాట అన్నందుకు నేను ఇక్కడెందుకు అంటూ గవర్నర్ లేవబోయారు. ఈ సమయంలో మరోసారి సర్వే మండిపడుతూ ఏం అనుకుని వెళ్తారు? మంద‌కృష్ణ‌ మాదిగను అరెస్ట్ చేస్తే నిరసన కూడా తెలపకూడదా అని ప్రశ్నించారు. గవర్నర్ సాబ్ మీరు మర్చిపోయినట్టున్నారు... సోనియా, మన్మోహన్‌ల దయవల్లే ఈ పదవి దక్కింది... మా గురించి అలా మాట్లాడుతున్నారు... వంగి వంగి దండాలు పెట్టి కుర్చీలో కొనసాగుతున్నావని సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.